మంత్రి కాకుండానే రేవంత్ ముఖ్యమంత్రి?
posted on Dec 1, 2023 @ 12:17PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో చేరి స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. మూడు ప్రధాన పార్టీలలో విజయం ఎవరిది? ప్రధాన ప్రతిపక్షం కాబోతున్నదెవరన్నచర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా కాంగ్రెైస్ దే అధికారం అని చెబుతున్నాయి. దాదాపుగా పాతికకి పైగా ఎగ్జిట్ పోల్స్ లో రెండు మూడు మినహాయించి మిగిలిన అన్ని సర్వేలూ అధికారం ‘హస్త’గతం కావడం తథ్యమని పేర్కొంటున్నాయి. పోలింగ్ తరువాత కాంగ్రెస్ నేతలలో జోష్ కనిపిస్తుంటే బీఆర్ఎస్ నేతలలో అది కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే అసలు మీడియా ముందుకే రాలేదు. ఎన్నికల అనంతరం కేటీఆర్ మినహా బీఆర్ఎస్ ముఖ్య నేతలెవరూ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. తప్పదన్నట్లు వచ్చిన కేటీఆర్ కూడా ఎగ్జిట్ పోల్స్ పై అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంయమనం పాటిస్తూ.. ఇకపై పరుష వ్యాఖ్యలకు దూరంగా హుందాతనంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ తీరును చూస్తుంటే కాంగ్రెస్ విజయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ కూడా అంగీకరించేసినట్లు కనిపిస్తోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కనుంది అనగానే తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్న రెండవ సీఎం ఎవరన్నచర్చకు తెరలేచింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. సీఎం పేరు లేకుండానే ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమే అయినా తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా అన్నీ తానై చక్రం తిప్పిన రేవంత్ రెడ్డిపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. అయితే కాంగ్రెస్ లో సీఎం రేసులో నలుగురు ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు. వారిలో ముందు పీఠిన ఉన్నది మాత్రం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రమే. పార్టీ హైకమాండ్ మొగ్గు కూడా ఆయనవైపే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను రేవంత్ చేపట్టిన తరువాత కింది స్థాయి నుంచీ పార్టీలో జోష్ పెరిగింది. విజయంపై నమ్మకం కలిగిందని పార్టీలో ఆయనను వ్యతిరేకించే వారు కూడా అంగీకరించక తప్పని వాస్తవం. ఎన్నికలకు ముందే రేవంత్ సీఎం అభ్యర్థిత్వం ఖరారైందనీన, అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించ లేదనీ పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. అందుకే రేవంత్ కు ఎన్నికలలో అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్కీ, షబ్బీర్ అలీ లాంటి లీడర్లు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. భట్టి విక్రమార్క అయితే రాష్ట్రంలో సగభాగం పాదయాత్ర కూడా చేపట్టారు. ఎస్సీ నేత కావడం భట్టికి కలిసి వస్తుంది. అయితే, సామజిక సమీకరణాల నేపథ్యంలో అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం రేవంత్ రెడ్డి తన శక్తికి మించి పోరాడారు. స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని దాదాపుగా ఒంటి చేత్తో నడిపించారు. ప్రజల్లో బాగా పలచ పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపి ఇప్పుడు ఓట్లుగా మార్చడంలో రేవంత్ అతడే ఒక సైన్యం అన్నట్లుగా కనిపించారు. దీంతో అధిష్ఠానం కూడా రేవంత్ ను కాకుండా మరొకరిని సీఎం పదవి కోసం పరిశీలించే అవకాశాలు ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ కనీసం మంత్రి పదవి కూడా చేపట్టలేదు. గతంలో తెలుగు దేశం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేశారు. దీంతో ఇప్పటికే దీనిపై మీడియా నుండి రేవంత్ రెడ్డికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నికలకు ముందే మీడియా ఇంటర్వ్యూలలో మంత్రిగా కూడా పరిపాలన అనుభవం లేని రేవంతును సీఎం చేసేందుకు మిగతా కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.
దీనికి రేవంత్ కూడా చాకచక్యంగానే సమాధానాలు చెప్పారు. ఇందిరాగాంధీ ఎలాంటి పరిపాలనా అనుభవం లేకుండానే దేశ ఆర్ధిక వ్యవస్థ స్థితి గతిని మార్చేసి, పాకిస్తాన్ ను ఓడించి, బంగ్లాదేశ్ విముక్తికి సహకరించి అద్భుతమైన పాలన అందించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారనీ, అలాగే ఎలాంటి పాలనా అనుభవం లేని సీఎంగా ఎన్టీఆర్ సుభిక్ష పాలన అందించారనీ, ఇప్పటికీ వారి పరిపాలన గురించి మనం మాట్లాడుకుంటున్నామని అటువంటప్పుడు తన సామర్ధ్యాన్ని ఎలా తక్కువ అంచనా వేస్తారని రేవంత్ సమాధానంతోనే ఎదురు ప్రశ్నలు సంధించారు. దీనిని బట్టి చూస్తే రేవంత్ మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి కావడం ఖాయమని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.