రాష్ట్రం పరువు గంగ పాలు.. ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు సీ గ్రేడ్!
posted on Dec 1, 2023 @ 1:18PM
జగన్ సర్కార్ పనిగట్టుకొని రాష్ట్రం గంగలో కలిపేస్తున్నది. కే వలం రూ.14 కోట్లు వడ్డీ కట్టలేక మరో సారి ఏపీ ప్రతిష్టను బజారుకీడ్చింది. ఇప్పటికే రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల కుప్పలా మార్చేసిందని పలు నివేదికలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో హెచ్చరించింది. కానీ జగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇప్పటికీ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం వెంపర్లాడుతోంది. అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేసుకుంటూ, బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేస్తోంది. చివరికి మద్యం మీద వచ్చే ఏళ్లల్లో రానున్న ఆదాయాన్ని చూపి కూడా అప్పులు తెచ్చింది.
ఇప్పటికే ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పుల పరిధికి మించి ఏపీ ప్రభుత్వం అప్పులు చేసేసింది. తెచ్చిన అప్పులను ఏదైనా అభివృద్ధి, ఉపాధి రంగంలో పెట్టుబడులు పెట్టి ఆదాయాన్ని గడిస్తున్నదా అంటూ అంటే అదీ కూడా లేదు. బటన్ నొక్కుడు ద్వారా పప్పు బెల్లాల మాదిరి పంచుకుంటూ వెల్లుతున్నది. అప్పు చేసి తెచ్చిన నిధులను సక్రమంగా వినియోగించడం లేదు. అసలు ప్రభుత్వమే అప్పుల మీద నడుస్తోంది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అప్పుల విషయంలో రాష్ట్రం డేంజర్ లిస్టులోకి వెళ్ళింది. ఏపీకి కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ లు ఇచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. అంతేకాదు రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది. ఇప్పుడు ఏపీ క్యాపిటల్ బాండ్స్‌కు స్టాక్ ఎక్సేంజ్ షాక్ ఇచ్చింది. ఏకంగా ఏపీ బాండ్లకు సీ గ్రేడ్ కేటాయించింది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజ్‌లకు రేటింగ్ సంస్థలు నోట్ పంపాయి. హై రిస్క్‌తో కూడిన బాండ్స్‌గా అక్యూట్ రేటింగ్ సంస్థ ఏపీ క్యాపిటల్ బాండ్లను పేర్కొంది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వమేనని ఆ సంస్థ పేర్కొంది. ఈ బాండ్స్‌కు చెల్లించాల్సిన రూ.14 కోట్లు వడ్డీ కూడా నెల రోజులు ఆలస్యంగా చెల్లించారని రేటింగ్ సంస్థ వెల్లడించింది. గతంలో రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో ఉండాల్సిన రూ.525 కోట్ల మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకోవడంతో క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేయగా.. ఇప్పుడు రూ.14 కోట్లు వడ్డీ కూడా సమయానికి కట్టలేదని స్టాక్ ఎక్సేంజ్ సీ గ్రేడ్ కేటాయించింది. క్యాపిటల్ బాండ్స్‌కు సీ కేటగిరీ రేటింగ్ ఇవ్వడంతో బాండ్స్ కొనుగోలు చేసిన మదుపరులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
దీంతో ఏపీ పరువు మరోసారి బజారున పడింది. ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక పతనానికి పరాకాష్టగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ఆ వెంటనే రూ.2000 కోట్లకి బాండ్స్ రిలీజ్ చేస్తే అవీ హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్స్ అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ జారీచేస్తే.. చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసేసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా, దివాళా తీసిన రాష్ట్రంగా రికార్డు క్రియేట్ చేస్తున్నది.