కన్నీటి పర్యంతమైన రేవంత్.. మునుగోడు ఫలితం అర్ధమైపోయిందా?
posted on Oct 21, 2022 @ 12:53PM
కాంగ్రెస్ లో ఏదైనా జరగొచ్చు.. ఏమీ జరగకనూ పోవచ్చు. ప్రజాదరణ ఉన్న నాయకులను సొంత పార్టీ వాళ్లే కాళ్లు పట్టి కిందకు లాగేస్తారు. అందుకే అంటారు కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులెవరూ ఓడించాల్సిన అవసరం లేదు..ఆ పార్టీయే తన ఓటమిని లిఖించుకుంటుంది అని. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఒక నాడు దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ అధకారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రతి పక్ష హోదాకు పాకులాడాల్సిన పరిస్థితిని దిగజారిపోయింది.
కేవలం రెండంటే రెండు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. మళ్లీ ఎన్నికలలో ఆ రాష్ట్రాలలోనైనా అధికారం నిలుపుకుంటుందా? అంటే ఆ పార్టీలో ఎవరూ ఆత్మవిశ్వాసంతో ఔనని చెప్పలేని పరిస్థితి. అటువంటి కాంగ్రెస్ అనూహ్యంగా తెలంగాణలో పుంజుకుంది. తెరాస, బీజేపీలతో దీటుగా తలపడి రాష్ట్రంలో అధికారంపై ఆశలు పెంచుకునే స్థాయికి ఎదిగింది. తెలంగాణలో నిర్వీర్యమై పోయిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకుందంటే అందుకు కారణంఏమిటంటే.. ఎవరైనా ఠక్కున చెప్పే జవాబు రేవంత్ రెడ్డి అనే. అటువంటి రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ముందు కన్నీటి పర్యంతమయ్యారు. వాస్తవానికి రాజకీయ ప్రత్యర్థులపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేసే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ప్రత్యర్థి పార్టీలతో కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పోరాటానికే అధిక సమయం వెచ్చించాల్సిన పరిస్థితులలో పడ్డారు.
ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో యువత నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగే పార్టీ సీనియర్లలో ఆయన పట్ల అసూయ పెంచిందని పరిశీలకులు అంటున్నారు. రేవంత్ పార్టీని ప్రజలలోకి తీసుకువెళుతుంటే.. పార్టీకి రాష్ట్రంలో ఆదరణ పెరుగుతుంటే.. ఆ క్రెడిట్ రేవంత్ కు దక్కకుండా చేయడానికి పార్టీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు పన్నుతున్న కుట్రలు, సృష్టిస్తున్న అవాంతరాలను ఎదుర్కొనడంలో ఆయన విసిగిపోయారా అన్న అనుమానం కలుగుతోంది.
అయితే పరిశీలకులు మాత్రం రేవంత్ కు మునుగోడు ఫలితం అర్ధమైపోయిందనీ, ఆయనను దెబ్బతీయడానికి పార్టీలోనే కుట్ర జరుగుతోందని.. దాని ఫలితమే రేవంత్ తాజా ఆవేదన అని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి ఇక తేరుకోలేకుండా పాతేసేందుకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక అదే సమయంలో పీసీపీ అధ్యక్ష పదవి తనను వరించినందుకు పార్టీలోని కొందరు కక్ష కట్టి తనను ఒంటరి వాడిని చేశారని ఆవేదనా వ్యక్తం చేశారు. తనను అభిమానించే వారికీ, పార్టీ క్యాడర్ కు తన ఆవేదన తెలియజేస్తున్నన్న రేవంత్.. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఇక కేసీఆర్ అన్ని రోజులు హస్తినలో మకాం వేసి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు కేసీఆర్ బీజేపీ నుంచి సుపారీ తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర ఫలితమే మునుగోడు ఉప ఎన్నిక అని రేవంత్ అభివర్ణించారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించి రేవంత్ రెడ్డిని పిసీసీ నుండి తొలగించాలని భారీ కుట్ర జరుగుతోందని రేవంత్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ కుట్రలో కాంగ్రెస్ లోని కొందరు నాయకులకు కూడా భాగస్వామ్యం ఉందని రేవంత్ అన్నారు.