ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు అరికట్టలేరా?
posted on Oct 29, 2012 @ 3:31PM
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు అరికట్టడం అసాధ్యమా? ఎందుకు పోలీసులు, అటవీశాఖాధికారులు దాడులకు మాత్రమే పరిమితమయ్యారు? ఈ రెండు ప్రశ్నలు జిల్లావాసుల మెదడును తొలిచేస్తున్నాయి. ప్రత్యేకించి కోట్లాది రూపాయల ఎర్రచందనం పలుప్రాంతాల్లోని పరిశ్రమలకు తరలించేందుకు స్మగ్లర్లు నడుపుతున్న నెట్‌వర్క్ జిల్లా వాసులను కలిచివేస్తోంది. ప్రభుత్వానికి ప్రతిగా రాజ్యమేలుతున్న స్మగ్లర్లు ఆయుధాలతో తిరుగుతుండటం కూడా భవిష్యత్తులో భారీప్రమాదానికి సంకేతంగా నిలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఎదురుకాల్పులకు తెగించిన స్మగ్లర్లు ఇంకేమి చేస్తారో అని జిల్లావాసులు భయపడుతున్నారు. కొన్ని అటవీగ్రామాలను తమ సొంత అడ్డాగా మార్చుకున్న స్మగ్లర్ల వివరాలు సేకరించటం, వారిని అదుపులో పెట్టడం పోలీసులకు, అటవీశాఖాధికారులకు ఏమంత కష్టం కాదు. అయినా ఎందుకు వారిని అదుపులో పెట్టలేకపోతున్నారు? అంటే అమ్యామ్యాలా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతోంది. కానీ, పోలీసుల దాడిలో దొరికిన సరుకు చూస్తుంటే ఎంత విలువైన సంపదను స్మగ్లర్లు దోచుకుంటున్నారో అన్న ఆందోళనా తప్పటం లేదు. తాజాగా 80లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను రేణిగుంట దగ్గర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలానే గుడిపాల మండలం ఎన్‌ఆర్‌పేట చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు దొరికాయి. ఈ రెండు సంఘటనలూ పోలీసు, అటవీశాఖల సమర్ధతను వెక్కిరిస్తున్నాయి.