అందుకేనా వెనకడుగు?
posted on Nov 22, 2021 @ 1:24PM
ఇది జగన్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త కాదు. అధికారంలోకి వచ్చింది మొదలు, అడుసు తొక్కడం కాలు కడగడం వైసేపీ ప్రభుత్వానికి అలావాటుగా మారింది. ఇది జగత్ విదితం. అయితే గతంలో పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం మొదలు, అనేక వివాదస్పద నిర్ణయాలను, జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్టుల మొట్టికాయలువేసిన తర్వాతనే వెనక్కి తీసుకుంది.కానీ, మూడు రాజధానుల నిర్ణయాన్ని మాత్రం కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే వెనక్కి తీసుకుంది. ఈ నేపధ్యంలో, జగన్ ప్రభుత్వం ఇంత హటాత్తుగా ఈనిర్ణయం ఎందుకు తీసుకుంది అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే, ఇందుకు 700 రోజులకు పైగా రైతుల చేస్తున్న ఆందోళనే ప్రధాన కారణం అయినా, ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అందులో ప్రధానమైనది, ఇంతకాలం రైతులు, అమరావతికే పరిమితమై, అక్కడే ఆందోళన చేస్తున్నారు. కానీ, గత 22 రోజులుగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతొ మహా పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ మహా పాద యాత్రకు ఎక్కడిక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పోలీసులు ఎన్ని అక్షలు పెట్టినా, అవరోధాలు సృష్టించిన వేలాదిగా ప్రజలు స్వచ్చందంగా యాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర పొడుగునా మూడు రాజధానులు మా కొద్దు .. అమరావతి ఒక్కటే ముద్దు’ అనే నినాదం మారుమోగింది. ఈ నేపద్యంలో, జనంనాడి ఏమిటో జగన్ రెడ్డికి తెలిసొచ్చిందని, అందుకే మనసు మార్చుకున్నారని అంటున్నారు.
అలాగే, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఇటీవల రాష్ట్ర పర్యటనలో పర్యటించిన ‘ఒకే ఒకటే రాష్ట్రం .. ఒకటే రాజధాని స్టాండ్’ ను పునరుద్ఘాటించారు. అంతే కాకుండా రైతులు సాగిస్తున్న పాదయాత్రలో రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గోనితీరాలని హుకుం జారీచేశారు. ఈ నేపద్యంలోనే రాష్ట్ర బీజేపీ నాయకులు ఆదివారం రైతుల మహా పాదయాత్రలో కాలు కదిపారు. దీంతో మెడ చుట్టూ అనేక పాపాల కత్తులు వేళ్ళాడుతున్న సమయంలో కేంద్రంతో పెట్టుకోవడం మంచిది కాదనే ప్రాప్తకాలజ్ఞ్తత పనిచేసి జగన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆలాగే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పునురుత్తేజం పొందేందుకు, అమరావతి అభివృద్ధి రాజధాని మార్గం చూపుతుందని, అందుకోసంగానూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు మొండి పట్టు వదిలారనే మాట ఒకటి వినిపిస్తోంది. అయితే, జగన్ రెడ్డి మనసులో ఏముందో కానీ, ఈ చర్చ ఇలా సాగుతున్న సమయంలోనే, మరో ఆసక్తికర విషయం తెలియవచ్చింది. పాలనావికేంద్రీకరణకు సంబంధించి మరో బిల్లును ప్రవేశపెట్టే అసెంబ్లీ వేదికగా జగన్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అసెంబ్లీలో ఉపసంహరణతో పాటు కొత్త బిల్లుకు సంబందించి జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఈ బిల్లులో ఏయే అంశాలు ఉంటాయి..? జగన్ ఏం ప్రకటిస్తారో..? అనే విషయాలపై రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ఒకరిద్దరు మంత్రులు మాట్లాడుతూ.. టెక్నికల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని.. జగన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలియజేశారు. సో... చివరకు ఏమవుతుంది ... అనేది అసెంబ్లీ ప్రకటనతోకానీ తెలియదు.