సీమలో లంచాల వసూళ్లకు సొంతసైన్యం
posted on Mar 2, 2012 @ 2:35PM
రాయలసీమ: రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో తూనికలు, కొలతల శాఖ పీకలలోతు అవినీతిలో కూరుకుపోయింది. ఈ శాఖ అధికారులు, ఉద్యోగులు అందినకాడికి లంచాలు తీసుకుంటూ అమాయక వినియోగదారులకు అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం విధించే టార్గెట్లను ఎక్కువశాతం అమాయక వ్యాపారుల ద్వారా పూర్తిచేసుకుని మోసాలకు పాల్పడే వ్యాపారులనుంచి మామూళ్ళు వసూలు చేసుకుంటూ ఎసి-డిసి స్థాయి అధికారులు దండుకున్న మొత్తాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఈ శాఖ ఉన్నతాధికారి ఒకరు లంచాల వసూళ్లకు తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొంత సైన్యమే వ్యాపారుల వద్దకు తనిఖీల పేరుతో వెళుతుంది. తరువాత వారు అక్కడనుంచి వ్యాపారులతో తమ యజమానితో సెల్ ఫోన్ లో మాట్లాడిస్తున్నారు. అక్కడికక్కడే లంచాలు సెటిలైపోతున్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు అసిస్టెంట్ కమీషనర్ లేకపోవడంతో పొరుగునే ఉన్న జిల్లాకు చెందిన ఒక అధికారికి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో కడప, కర్నూల్ జిల్లాలతో పాటు ఈ రెండు జిల్లాల్లో కూడా లంచాలుదండుకునే అవకాశం ఆ అధికారికి లభించినట్లు వ్యాపారులు అంటున్నారు. ప్రాంతీయస్థాయి అధికారులు జిల్లాస్థాయి అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి వ్యాపారస్తుల నుండి భారీగా మామూళ్ళు దండుకుంటున్నారన్న విమర్సలు వస్తున్నాయి.