Read more!

రతన్ టాటా జీవనశైలి..

రతన్ టాటా.. పరిచయం అక్కరలేని పేరు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. టాటా గ్రూప్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో కొనసాగిస్తూ అనేక నూతన ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేశారు. నానో కారు ఆయన ఆలోచనే. దేశభక్తి, ఉద్యోగుల పట్ల అనురక్తి, వ్యాపారవిస్తరణలో యుక్తి ఆయన సొంతం. ఆయన జీవనశైలిని గమనిస్తే స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వం కనిపిస్తుంది..

 

రతన్ టాటా తండ్రి నావెల్ టాటా దత్తత వచ్చారు.  తండ్రి మాదిరిగానే రతన్ టాటా బాల్యంలో చాలా కష్టాలు అనుభవించారు. అతని పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో బామ్మ వద్ద పెరిగారు.  ఐబిఎంలో వచ్చిన ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. ఒకవేళ ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలి ఉండకపోతే ఈ రోజు ఇంత పేరుప్రఖ్యాతులు దక్కేవి కావు. అధికారం, హోదా ఉన్నప్పటికీ రతన్ టాటా సాధారణ జీవితాన్నే ఇష్టపడతారు.

 

రతన్ టాటా  ఆర్కిటెక్చర్ డిగ్రీని  పూర్తి చేసిన తర్వాత  హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఏ మాత్రం ఖాళీ సమయం ఉన్న తనకు ఎంతో ఇష్టమైన ఫెరారీ కారు నడపడాన్ని ఇష్టపడతారు. అంతేకాదు అతని వద్ద అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంటుంది. ఫెరారీ కాలిఫోర్నియాతో పాటుగా కాడిలాక్ ఎక్స్‌ఎల్‌ఆర్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, క్రిస్లర్ సెబ్రింగ్, హోండా సివిక్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, మసెరటి క్వాట్రోపోర్ట్, మెర్సిడెస్ బెంజ్ 500 ఎస్ఎల్, జాగ్వార్ ఎఫ్ టైప్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్-ఆర్ తదితర కార్లు ఉన్నాయి.

 

రతన్ టాటా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ పురస్కారాలు,  బ్రిటిష్ ఎంపైర్ కైట్స్ గ్రాండ్ క్రాస్ అందుకున్నారు. పైలట్ లైసెన్స్ పొందిన అతను టాటా గ్రూప్ ఎయిర్ క్రాఫ్ట్ నడిపారు. 17ఏళ్ల వయసులోనే  మొదటిసారి సోలోగా ఫ్లైట్ నడిపిన ఆయన ఒక ఫ్లైట్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఎఫ్ - 16 ఫైటర్ జెట్ ను ఎయిర్ షోలో నడిపిన మొదటి భారతీయ వ్యక్తి రతన్ టాటానే.

 

జాగ్యార్, కోరస్, ల్యాండ్ రోవర్, టెట్లీలను సంపాదించిన అతను భారతీయ కంపెనీని అంతర్జాతీయ స్థాయికి  చేర్చారు. అతను మిత్సుబిషి కార్పొరేషన్, బూజ్ అలెన్ హామిల్టన్, ఏఐజి అండ్ జెపి, మోర్గాన్ చేజ్ సంస్థల  సలహా బోర్డు సభ్యునిగా ఉన్నారు. నానో కార్లు రతన్ ప్రియమైన ప్రొజెక్ట్. మధ్యతరగతివారికి లక్షరూపాయలకే సొంతకారు కొనుక్కొనే అవకాశం కల్పించారు.

 

వ్యాపార రంగంలో బిజిగా ఉండే అతనికి పెంపుడు కుక్కలన్నా చాలా ఇష్టం. తన రెండు పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. రతన్ టాటా నిస్వార్థపరుడు, అద్భుతాలను సృష్టించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. తమ సంస్థ ఏర్పాటుచేసిన సంక్షేమ ట్రస్ట్ ఇప్పటికే ఎంతోమందిని ఆదుకుంటుంది.

 

రతన్ టాటా బిలియనీర్ల జాబితాలో చేర్చబడలేదు, ఎందుకంటే సంపదను దాచకుండా పంచుకోవడమే అతనికి ఇష్టం.తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు. అతని వినయంతో కూడిన జీవనశైలి డబ్బు కన్నా మనుషులకు ఎక్కువ విలువ ఇస్తారని స్పష్టం చేస్తుంది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ అతనికి ఎంతో గౌరవాన్ని తెచ్చింది. తన హోదాను ప్రదర్శించుకోవాలన్న ప్రయత్నం ఎప్పుడు రతన్ టాటా చేయరు.

 

రతన్ టాటా పెద్ద వ్యాపార వేత్త అయినప్పటికీ అవసరమైనప్పుడు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తారు. డాబు దర్పం ప్రదర్శించాలన్నఆలోచన లేదు.  రతన్ సేవలు వెలకట్టలేనివి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయచర్యలకు రిలీఫ్ ఫండ్ అందించడంలో రతన్ టాటా పేరు ఎప్పుడు ముందే ఉంటుంది.

 

అందరినీ సమానత్వంతో చూసుకోవడమే చాలా మందికి స్ఫూర్తినిస్తుందని నమ్మే దార్శనికుడు రతన్ టాటా.  ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్ నే కాకుండా సామాజిక కార్యకర్త , గొప్ప నాయకుడు అని చెప్పవచ్చు. అందుకు కారణం వినయం, నిస్వార్థంతో కూడిన అతని జీవనశైలి.  వందలాది కోట్లకు అధిపతి అయినా అందరితో కలిసిపోయే తత్త్వం ఆయన సొంతం. ఆ వ్యక్తిత్వమే ఆయనను గొప్పవ్యక్తిగా దేశమే కాదు ప్రపంచం గుర్తించేలా చేసింది.