రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే.. ఓట్ల కోసం బీజేపీ ఎత్తుగడ?
posted on Apr 1, 2021 @ 11:10AM
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు. "ఈ విషయాన్ని తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు" అని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రజనీకాంత్ కు అవార్డు దక్కడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో బీజేపీ కలిసి పోటీ చేస్తోంది. అయితే తమిళనాడులో ఈసారి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమికే అధికారం ఖాయమని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే తమిళ ఓటర్ల మద్దతు కోసమే రజనీకాంత్ కు కేంద్ర సర్కార్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో రజనీకాంత్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. రజనీ అభిమానుల ఓట్ల కోసమే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తమిళనాడులో రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించారు. కాని పార్టీ పెట్టలేదు. అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు రజనీకాంత్. బీజేపీ డైరెక్షన్ లోనే రజనీకాంత్ పార్టీ వస్తుందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. రజనీకాంత్ కొందరు బీజేపీ నేతలు మంతనాలు సాగించడం, ప్రధాని మోడీకి అనుకూలంగా ఆయన ప్రకటనలు చేయడంతో ఇది నిజమేనని అంతా భావించారు. రజనీకాంత్ ను బీజేపీలోకి రావాలని కేంద్రం పెద్దలు ఆహ్వానించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకు రజనీ అంగీకరించకపోవడంతో పార్టీ దిశగా బీజేపీ నేతలే నడిపించారని చెబుతారు. పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గాక కూడా రజనీతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. దీంతో తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతు రజనీకాంత్ మద్దతుగా ప్రకటన చేస్తారనే చర్చ జరిగింది.
ఇప్పుడు పోలింగ్ సరిగ్గా వారం రోజుల ముందు రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం రాజకీయ కోణంలోనే జరిగిందనే అభిప్రాయమే మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. డీఎంకే నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం రాజకీయాలకు, అవార్డుకు సంబంధం లేదని చెబుతోంది. మొత్తానికి రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తమిళనాట రాజకీయాల్లో కాక రేపుతోంది.