రాజస్థాన్ సీఎం గెహ్లాట్ తప్పులో కాలు! బడ్జెట్ ప్రసంగం అభాసు పాలు!
posted on Feb 11, 2023 @ 11:17AM
కుడి ఎడమైతే పోరపాటు లేక పోవచ్చు. కానీ ఏకంగా రాష్ట్ర బడ్జెట్ తారుమారై పోతే, కిందటేడాది బడ్జెట్ ను తీసుకొచ్చి ఈ ఏటి బడ్జెట్ ఇదే అని చదివి వినిపిస్తే ఏమవుతుంది? ఆ చదివింది ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రే అయితే..ఇంకెలా ఉంటుంది? వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా, రాజస్థాన్ శాసన సభలో అదే జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 2023-24 వార్షిక బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. అయితే, అది ఈ ఏడాది బడ్జెట్ కాదు. గత సంవత్సరం బడ్జెట్ నే, ఉత్సాహంగా చదువు కుంటూ పోయారు. అలా ఓ ఎనిమిది నిముషాలో ఏమో ఆయన పాత పద్దులనే చదువుకుంటూ పోయారు. అలాగే వదిలేస్తే.. చివరి వరకు చదివేసి కూర్చునే వారో ఏమో కానీ, కొంచెం చాల ఆలస్యం గానే అయినా అధికారులు, సిఎం గారి స్పీచ్ రివర్స్ లో పోతోందని గుర్తించారు.
ఆల్రెడీ అమలవుతున్న పట్టణ ప్రాంత పేదలకు కోసం ఉద్దేశించిన ఉపాధి హామీ పధకం ఇప్పుడే కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో అధికారులు కళ్ళు నులుముకున్నారు. ముఖ్యమంత్రి తప్పులో కాలేశారని గత సంవత్సరం బడ్జెట్ చదివేస్తున్నారని గుర్తించారు. అదే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి నాలుక కరుచుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఆయన గతేడాది పద్దులోని విషయాలనే ఈ సారి కూడా చదవడంతో ఈ పరిస్థితి ఎదురైంది.
సీఎం అశోక్ గెహ్లాట్ వద్దే ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఉంది. ఈ క్రమంలో శుక్రవారం ( ఫిబ్రవరి 10) ఆయనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ప్రతులను చదవడం ప్రారంభించిన ఆయన.. పాత పథకాలు, గత ఏడాది అమలు చేసిన పట్టణాభివృద్ధి ప్రణాళికలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రి మహేశ్ జోషి ఈ విషయాన్ని గుర్తించి, సీఎంకు తెలియజేశారు. ఈ పరిణామంతో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్త పద్దులోని విషయాలు లీక్ అయ్యాయా..? అని నిలదీశారు. దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎనిమిది నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదివారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. నేను సీఎంగా ఉన్నప్పుడు.. ఒకటికి రెండు సార్లు ప్రతులను పరిశీలించుకునేదాన్ని. ఇలా పాత బడ్జెట్‌ను చదివేవారి చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరే ఊహించుకోగలరు అని మాజీ సీఎం వసుంధరా రాజే విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని,గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. నేను చదువుతున్న ప్రతులకు, మీ చేతిలో ఉన్న ప్రతుల్లోని అంశాలకు తేడా ఉంటే మీరు లేవనెత్తాలి. ఆ పాత పత్రాలను చూసుకునేందుకు తెచ్చాను. ఇక్కడ ఎలాంటి లీక్ జరగలేదు. అంటూ తనను తాను సమర్ధించుకున్నారు. చివరకు, అంతా సజావుగా సాగిపోయింది .. 2023 -24 వార్షిక బడ్జెట్ ను ముఖ్యమంత్రి సభలో ప్రవేశ పెట్టారు. మొత్తానికి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం ముగిసింది.