కేటీఆర్ టార్గెట్ కాంగ్రెస్ కాదు.. రేవంత్ రెడ్డి!
posted on Feb 11, 2023 @ 10:49AM
అవును. మంత్రి కేటీఆర్ బీజేపీనే కాదు కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలోనూ ముందుంటారు. అయితే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, అంతే. అదే తేడా. అయితే, అదే సమయంలో కేటీఆర్ విమర్శలను కొంచెం లోతుగా పట్టి చూస్తే, ఆయన విమర్శల్లో కాంగ్రెస్ వ్యతిరేకతకంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది.
అందులోను ఒక వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ధరణి బాగోతంపై చర్చ జరుగతున్న సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు, మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర బాబు, మాట్లాడుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకున్నారు. ధరణి పోర్టల్ ఉంచాలా, రద్దు చేయాలా అనే విషయంలో కాంగ్రెస్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదని ఆరోపించారు. అంతవరకు బాగుంది కానీ, పనిలో పనిగా శ్రీధర్ బాబుతో పాటుగా, సభలో మిగిలిన నలుగురు కాంగ్రెస్ సభ్యులకు మంత్రి కితాబు నిచ్చారు. కాంగ్రెస్ సభ్యులంతా మంచోళ్లే, బయటి నుంచి వచ్చిన వారితోనే పేచీ అంటూ పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయండి అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ‘నక్సల్స్’ కు ఇచ్చిన పిలుపునూ ప్రస్తావించారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆయన ప్రత్యర్ధి వర్గం మధ్య సాగుతున్న అంతర్గత కుమ్ములాటలను మరింతగా ఎగదోసేందుకే కేటీఆర్ సభలో లేని రేవంత్ రెడ్డిపై, నిబంధనలకు విరుద్ధంగా విమర్శలు చేశారు.
నిజానికి, కాంగ్రెస్ పార్టీలో ఒక్క రేవంత్ రెడ్డి మినహా ఇంచుమించుగా మిగిలిన అందరు ముఖ్య నాయకుల విషయంలో మంత్రి కేటీఆర్ కు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా మంచి అభిప్రాయమే వుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఇలాగే సభలో, సభ వెలుపల కూడా ప్రశంసలతో ముంచెత్తారు. భారాస లోకి రావాలని బహిరంగంగానే ఆహ్వానించారు.
సరే భట్టి ప్రలోభాలకు లొంగ లేదనుకోండి అది వేరే విషయం. అయితే, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం అవతలి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలను కొనసాగిస్తోందని అంటున్నారు. ఇదలా ఉంటే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వేల్లెందుకే ముఖ్యమంత్రిని కలిశానని, జగ్గారెడ్డి చెప్పినా, ఇంతకాలం లేనిది ఇప్పడు నియోజకవర్గం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడం ఏమిటని కాంగ్రెస్ నాయకులే అనుమానిస్తున్నారు.
మొత్తానికి ఎన్నికలు నెలల్లోకి వచ్చినా బీఆర్ఎస్ నాయకత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎరవేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఒంటిరిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కేసీఆర్ కేటీఆర్ దువ్వుతున్నారని అంటున్నారు.