అసలు కాంగ్రెస్ రాజయ్యకు టికెట్ ఇవ్వకుంటే..?సారిక బతికుండేదా?
posted on Nov 6, 2015 @ 3:06PM
కాలం కలిసిరానప్పుడు ఏం చేసిన ఏం ప్రయోజనం ఉండదు..ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఉంది. అసలే రాష్ట్ర విభజన చేయడంవల్లో పూర్తి ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఏదో ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతుందనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు రాజయ్య వ్యవహారం ఒకటి తలనొప్పిగా తయారైంది.
రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు చనిపోయిన నేపథ్యంలో ఇప్పటికే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నాయి. అయితే అంతా బానే ఉన్నా ఇప్పుడు ఒక విషయం గురించి మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు. అది రాజయ్య టికెట్ గురించి. అసలు కాంగ్రెస్ పార్టీనే కనుక రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని అనుకుంటున్నారు.
వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజయ్యకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాజయ్య నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే రాజయ్య కోడలు సారిక అంతకు ముందే అధిష్టానానికి లేఖ రాసిందనే వార్తలు వస్తున్నాయి. మరి ఆలేఖ ఏమైందో ఏమో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజయ్యకు టికెట్ ఇచ్చింది. అయితే రాజయ్యకు వరంగల్ లో ఉన్న తన ఇంటి నుండి నామినేషన్ వేయాలనే సెంటిమెంట్ ఉండటంతో.. ఎప్పటినుండో వరంగల్ రాని రాజయ్య నామినేషన్ వేయడానికని వచ్చారు. అయితే అక్కడ కోడలు సారికతో రాజయ్య గొడవపడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవ కూడా సారిక లేఖ రాసినందుకే రాజయ్య గొడవ పడ్డాడని అంటున్నారు. ఆ గొడవ జరిగిన తరువాతే ఈ దారణమైన ఘటన చోటుచేసుకుంది.
దీంతో అసలు కాంగ్రెస్ పార్టీనే కనుక రాజయ్యకు టికెట్ ఇవ్వకపోతే ఇలాంటి ఘోరం జరుగుండేది కాదని అంటున్నారు. అంతేకాదు గతంలోనే సారిక.. మామ రాజయ్య, అతని కుటుంబసభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అది ఇంకా విచారణలోనే ఉంది. ఇప్పుడు అలాంటి రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ ఎలా టికెట్ ఇస్తుందని.. గృహహింస కేసు కింద కోడలిని వేధిస్తున్నట్లుగా చార్జిషీటు కూడా నమోదైన రాజయ్య తప్ప ఇంకేవరూ లేరా? అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజయ్య ఎఫెక్ట్ ఎక్కడ పార్టీ మీద పడుతుందా అని టెన్షన్ పడుతుంది. ఏదో పైకి మేకపోతు గాంభీర్యం చూపించినా లోపల మాత్రం టెన్షన్ మామూలే. ఇప్పటికే రాజయ్య కుటుంబంలో జరిగిన ఘటన గురించి ప్రచారంలో ఎక్కడా మాట్లాడొద్దని.. ఒకవేళ మాట్లాడిన సానుభూతి కలిగే మాటలు మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్నారు నేతలు. అంతేకాదు పార్టీనుండి రాజయ్యను సస్పెండ్ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ ఎన్నివిధాలా ప్రయత్నించినా ప్రజల్లో పడిన భావనను తొలగించాలంటే కుసింత కష్టమైన పనే.