రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
posted on Jul 8, 2014 @ 3:56PM
ఈసారి రైల్వే బడ్జెటులో చాలా ఆసక్తికరమయిన అంశాలున్నాయి. గంటకు 160-200కి.మీ వేగంతో నడిచే హై స్పీడ్ రైళ్ళు, గంటకు 300-350కి.మీ వేగంతో నడిచే బుల్లెట్ రైళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. రైల్వేల చరిత్రలో మొట్ట మొదటిసారిగా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించబోతున్నారు. లక్షల కోట్లు ఖర్చయ్యే బుల్లెట్ రైళ్ళ కావాలనుకొంటే ఇంతకంటే మంచి మార్గం లేదు. కానీ భద్రతా కారణాల చేత రైల్వేల నిర్వహణ (ఆపరేషన్స్)లో మాత్రం ఈ పెట్టుబడులను అనుమతించబోమని రైల్వే మంత్రి తెలిపారు.
ప్రస్తుతం నిమిషానికి కొన్ని వందలు ఆన్ లైన్ టికెట్స్ మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. దానిని ఏకంగా నిమిషానికి 7200 టికెట్స్ ఇచ్చే విధంగా, ఒకేసారి లక్షమంది లాగిన్ అయినా తట్టుకొనే విధంగా ఆన్ లైన్ విధానాన్ని ఆదునీకరిస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. అంతే కాక ఆన్ లయిన్ ద్వారా ప్లాట్ ఫారం టికెట్లు, స్టేషన్లలో ఉండే రిటైరింగ్ రూములు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంతవరకు ఆన్ లైన్ ద్వారా ఒకసారి కేవలం 5-6 టికెట్లు మాత్రమే బుక్ చేసుకొనే అవకాశం ఉండేది. కానీ తీర్ధయాత్రలు లేదా శుభ కార్యాలకు వెళ్ళేవారు ఏకంగా ఒక బోగీని లేదా ఏకంగా ఒక రైలుని కూడా బుక్ చేసుకొనే అవకాశం కల్పించబోతున్నారు. ఇక సరుకు రవాణా చేసుకొనే సంస్థలు కూడా ఆన్ లైన్ ద్వారా రైల్వే వేగన్లను బుక్ చేసుకొనే సదుపాయం కల్పించాబోతున్నారు. పోస్ట్ ఆఫీసులలో రైల్వే టికెట్స్ విక్రయిస్తామని తెలిపారు.
అన్ని ఏ కేటగిరీ రైళ్ళలో ఉచిత ‘వై ఫై’ సౌకర్యం, బయో టాయిలట్లు, స్టేషన్ల కప్పుల మీద సోలార్ విద్యుత్ ఫలకాలు ఏర్పాటు ద్వారా స్టేషన్లకు కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. రైళ్ళలో ప్రయాణిస్తున్న ఉద్యోగులు, వ్యాపారస్తులు , పారిశ్రామిక వేత్తలు తదితరులు ప్రయాణంలోనే తమ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి రైళ్ళలోనే వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే రైళ్ళలోనే ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన కంప్యూటర్లు, ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్ వంటి ఏర్పాట్లు ఉండవచ్చను.
ఇక రైల్వే ప్రయాణికులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య శుభ్రమయిన, రుచికరమయిన ఆహారం, మంచి నీళ్ళు, టాయిలట్లు, భద్రత. వీటన్నిటి కోసం వేర్వేరు ఏర్పాట్లు ప్రకటించారు. స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు, కార్పోరేట్ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా స్టేషన్లలో స్వచ్చమయిన నీళ్ళు ఏర్పాటు, వృద్ధులు, వికలాంగులను ప్లాట్ ఫారంలపైకి చేర్చేందుకు బ్యాటరీతో నడిచే వాహనాల ఏర్పాటు, అవుట్ సోర్సింగ్ ద్వారా పారిశుద్య పనులు నిర్వహించడం, వీటన్నిటిపై పర్యవేక్షణకు ప్రత్యెక వ్యవస్థల ఏర్పాటు చేయబోతున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు.
అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ, ప్రయాణం, రవాణా కూడా మరింత భారం అయ్యే అవకాశం ఉంది. జనరల్ బోగీకి- స్లీపర్-ఏసీ-క్లాసుల ధరలలో ఏవిధంగా తీవ్ర వ్యత్యాసం ఉంటుందో అదేవిధంగా ఒక సాధారణ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణానికి-హై స్పీడ్-బుల్లెట్ రైలు ప్రయాణానికి కూడా టికెట్ ధరలలో తీవ్ర వ్యత్యాసం ఉంటుంది.