బీజేపీ జాతీయ అధ్యక్షునిగా అమిత్ షా
posted on Jul 9, 2014 6:41AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హోంమంత్రిగా మోడీ ప్రభుత్వంలో బాధ్యతలు చెప్పట్టడంతో, ఆ పదవికి మరొకరిని ఎంపిక చేయవలసిన అవసరం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పేరు బీజేపీ జాతీయ అధ్యక్షునిగా దాదాపు ఖరారయింది. ఈరోజు డిల్లీలో జరిగే పార్టీ సమావేశంలో లాంఛనంగా ఆయనను ఎన్నుకొని పార్టీ అధ్యక్షునిగా ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఘన విజయానికి ఆయన కూడా ముఖ్య కారకుడు.
దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం కానిదే పార్టీ విజయం సాధించడం కష్టమని గ్రహించిన ఆయన, ఎన్నికలకు కొన్ని నెలల ముందుగా ఉత్తరప్రదేశ్ బాధ్యతలు స్వీకరించి అక్కడ పార్టీని బలోపేతం చేయడంతో ఊహించినట్లుగానే బీజేపీ ఘన విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నంలోనే ఆయన నరేంద్ర మోడీని వారణాసి నుండి పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేసి చివరికి అనుకొన్నది సాధించారు. అమిత్ షా పదునయిన వ్యూహాల ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బహు జన్ సమాజ్ వాదీ పార్టీలు నిలవలేకపోవడంతో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఆ ప్రభావం ఇరుగు పొరుగు రాష్ట్రాలయిన బీహార్, మధ్యప్రదేశ్, డిల్లీపై కూడా పడటంతో అక్కడ కూడా బీజేపీ ఘన విజయం సాధించింది.
ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనపై పట్టు సాధించి, దేశాన్ని అన్ని రంగాలలలో అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తున సమయంలో, సమర్ధుడు, నమ్మకస్తుడు తనకు అత్యంత సన్నిహితుడు అయిన అమిత్ షా చేతికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే, తన ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీని అన్ని వర్గాలు, మతాల ప్రజలకు సన్నిహితం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తునందున అమిత్ షాను ఆ పదవికి ఎంచుకొన్నారు.