రాహుల్ గాంధీకి సెలవు!!!
posted on Feb 23, 2015 @ 5:06PM
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేప్పట్టినప్పట్టిననాటి నుండి నేటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో పార్టీకి శల్య సారధ్యం చేసిచేసి అలసిపోయున్నారు. ఆయన సారధ్యంలో కాంగ్రెస్ రధం రివర్స్ గేరులో అన్ని పార్టీల కంటే చాలా వేగంగా వెనక్కి దూసుకుపోతూ వరుస అపజయాలతో ఒక సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. అధికారం ఉంటే ప్రజాసేవ చేయడానికి అలుపుసొలుపు ఉండదు. కానీ ప్రతీ ఎన్నికలలో ఓడిపోతుంటే చాలా నీరసం, నిరుత్సాహం కమ్ముకోవడం సహజం. ఎవరయినా బాగా నీరసించిపోతే బాగా రెస్టు తీసుకోమని డాక్టర్లు చెపుతుంటారు. యువరాజవారికి పార్టీ రధాన్ని ఒడుపుగా రివర్స్ గేరులో ఎలా వెనక్కి నడపాలో నేర్పించిన గురు సమానుడయిన దిగ్విజయ్ సింగ్ వంటి వారెవరో బహుశః ఆయనని కొన్ని వారాలు సిక్-లీవ్ పెట్టేసి రెస్టు తీసుకోమని చెప్పినట్లున్నారు. అందుకే ఆయన కొన్ని వారాలు శలవు తీసుకొంటున్నారుట.
అయితే ఈ శలవులో ఆయన ఏ స్విట్జర్ ల్యాండుకో, ఇటలీకో వెళ్ళిపోవాలని అనుకోకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రతీ ఎన్నికలలో ఎందుకు ఓడిపోతోంది? ఇకపై ప్రతీ ఎన్నికలలో గెలవాలంటే ఏమి చేయాలి? పార్టీని ముందుకు నడిపించాలా లేకపోతే లెఫ్టుకో, రైటుకో టర్నింగ్ తీసుకోవాలా? ఈ ‘యల్ బోర్డు’ తగిలించుకొని పార్టీని తనే నడపాలా? లేకపోతే స్టీరింగ్ మరెవరికయినా అప్పగించేసి వెనక సీటులో కూర్చొని కునుకు తీస్తే బెటరా? వంటి అనేక క్లిష్టమయిన సమస్యల గురించి మేధోమధనం చేయబోతున్నారు.
అంతే కాదు అసలు ఈ దేశంలో ఏమి జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఏమి జరుగబోతోంది? ఏమి జరగాలి? అనే బేతాళ ప్రశ్నలకు కూడా ఆయన ఈ లీవ్ పీరియడ్ లోనే సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తారుట! ఆ తరువాత మళ్ళీ వచ్చి తను కనుగొన్న ఆ గొప్పగొప్ప విషయాల గురించి ప్రజలకు చెప్పబోతున్నారుట! అంటే తను సంపాదించుకొనే ఆ...జ్ఞానాన్ని లోకానికి కూడా ఫ్రీగా పంచబోతున్నారన్న మాట.
ఇది వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తను సముపార్జించిన ఆ..జ్ఞానాన్ని అంతా స్కూలు పిల్లలకి, రోడ్డు మీద రిక్షా వాళ్ళకి, తన భజనలో తరించేపోయే కాంగ్రెస్ జీవులకీ అడగనివారిదే పాపం అన్నట్లు అందరికీ చాలా ఉదారంగా ఉచితంగా ఎడాపెడా పంచి పెట్టేసారు. ఒకప్పుడు కర్ణుడు తన గోల్డెన్ కవచ కుండలాలను అపాత్రాధానం చేసేసినట్లే, యువరాజవారు కూడా తన జ్ఞాన్నాని అందరికీ దానం చేసేయడంతో ఆయన అకౌంటు జీరో బ్యాలన్స్ కి వచ్చేసింది. అందుకే మళ్ళీ జ్ఞానోదయం కోసం లీవ్ పెట్టవలసి వచ్చింది. కనుక దేశ ప్రజలందరూ ఆయనకు జ్ఞానోదయం అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టక తప్పదు మరి.
ఆయన అపర దానకర్ణుడిలా తనకున్న జ్ఞానాన్ని అంతా అందరికీ పంచి పెట్టేసారు, కానీ అదంతా ఏట్లో పిసికిన చింత పండే అయిపోయింది. ఆయన చెప్పిన ప్రతీ ముక్కకీ భూమ్యాకాశాలు దద్దరిల్లి పోయేలా జనాలు చప్పట్లు కొట్టారు. గానీ ఆ మైమరపులో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం మరిచిపోయారు. దానితో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రధం క్రుంగిపోయినట్లే, సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంలో కాంగ్రెస్ రధం కూడా క్రుంగిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహిస్తే, ఆయన రధానికి ఎవరు సారధ్యం వహించారు? అనే ప్రశ్నకి ఇండియన్ జనాలందరికీ బాగానే తెలుసు.
గతం గతః అన్నారు పెద్దలు. అందుకే యువరాజవారు మళ్ళీ రీ చార్జ్ చేసుకొని వచ్చేందుకు లీవ్ పెట్టారు. లీవ్ నుండి తిరిగి వచ్చిన తరువాత యువరాజావారు పట్టాభిషేకానికి అంగీకరించినట్లయితే, ఏప్రిల్ నెలలో రాజమాత సోనియా గాంధీగారు వాలంటరీ రిటైర్ మెంటు తీసుకోవచ్చును. లేదా లేట్ అత్తగారు ఇందిరమ్మకి అసలు సిసలయిన వారసురాలని కాంగ్రెస్ జీవులచేత సర్టిఫై చేయబడుతున్న ప్రియాంకా గాంధీని తన కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం లేకపోలేదు. కనుక ఆ సోదరసోదరీమణుల్లో ఎవరో ఒకరు ఆ కుర్చీని ఆక్యుపై చేయవచ్చును. కానీ ఎవరు ఆక్యుపై చేస్తారో తెలుసుకోవాలంటే యువరాజవారి లీవ్ పూర్తయ్యే వరకు జనాలందరూ కొంచెం ఓపిక పట్టక తప్పదు.
కానీ ఆయన దేశం కోసమే అలా రాత్రనక పగలనక ఆలోచిస్తూ పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండిపోవడమే చాలా బాధ కలిగిస్తోంది. ఒకవేళ దేశ ప్రజలు ఆయనను ప్రధానమంత్రిగా చూసుకొనే భాగ్యానికి నోచుకోకపోయినా, ఆయన త్వరగా పెళ్ళిచేసుకొని దేశానికి మరో యువరాజును ప్రసాదించినా చాలు. జనాలు నిశ్చింతగా గుండెల మీద చేయ్యేసుకొని నిద్రపోతారు కదా! కనుక ఈ లీవ్ పీరియడ్ లోనే ఈ విషయం గురించి యువరాజవారు ఆలోచిస్తే బాగుంటుంది.