నడ్డా సారధ్యంలో సెమీస్ కు రె‘ఢీ’!
posted on Jan 18, 2023 @ 10:13AM
నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా జోడీ పార్టీ ప్రధాన జోడీగా పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగు తున్నాయి. సమయం సందర్భం ఏదైనా క్రింది స్థాయి సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అగ్ర నేతల వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ఆలోచనలే చేస్తారనేది అందరికీ తెలిసిన అందరూ అంగీకరించే వాస్తవం. నిజమే ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసమే రాజకీయ పార్టీలు ప్రతి అడుగులోనూ ఓట్లు సీట్లు లెక్కలు వేసుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమది ఎన్నికల యాత్ర కాదని ప్రకటించినా, అల్టిమేట్ గా ఆయన ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే అధికారమే శరణ్యమవుతుంది. బీజేపీ విషయంలోనూ అదే జరిగింది.
సరే అది అలా ఉంచితే, దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇతర ముఖ్య అంశాలు దేశం ఎదుర్కుంటున కీలక సమస్యల గురించి ఏ మేరకు చర్చించారో ఏమో కానీ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన (?) జేపీ నడ్డా ప్రసంగాలు మాత్రం తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే తొమ్మది రాష్ట్రాల రాజకీయాల చుట్టూనే తిరిగాయి.
ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని మోడీ ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. అంతే కాదు వచ్చే 400 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రోడ్డు మ్యాప్ ను నేతల ముందుంచారు. మరీ ముఖ్యంగా, అన్ని వర్గాలను అక్కున చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని, అందులో విధ్యవంతులైన ముస్లిం యువత కూడా ఉండాలని ప్రధాని మోడీ బీజేపీ నేతలకు సూచించారు.
మరో వంక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉపోద్ఘాతాలు, ఉత్ప్రేక్షలు లేకుండా నేరుగా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి గెలవాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలకు గానూ తొమ్మిది రాష్ట్రాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగరవేయాల్సిందేనని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఇందులో మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ దృష్ట్యా బీజేపీ ప్రస్థానంలో 2023 చాలా ముఖ్యమైన సంవత్సరమని చెప్పిన నడ్డా, ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడి గెలవాలి, ఆపై 2024లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని స్పష్టం చేశారు.
అయితే అది అనుకున్నంత మాత్రాన అయ్యే పనేనా అంటే అది వేరే విషయం. వేరే చర్చ. కానీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి బీజేపీ పార్టీ క్యాడర్కు సప్ష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. దిశా నిర్దేశం చేసింది. అసెంబ్లీ ఎన్నికల గుండా 2024 సార్వత్రిక ఎన్నికల ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.
కాగా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణతో పాటు కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర,మేఘాలయా,నాగాలాండ్,మిజోరాం రాష్ట్రాలున్నాయి. ఫిబ్రవరి మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబరులో మిజోరం ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు. 2024 మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో.. ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.