ఒంటరిగా సాగిపోతున్న రఘువీరుడు!
posted on Dec 4, 2015 @ 9:05PM
పాపం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పరిస్థితిని చూసి జాలిపడాలో, నవ్వుకోవాలో తెలియడం లేదు ప్రజలకి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనొక్కరే కనబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత కనబడకుండా మాయమయిపోయిన కాంగ్రెస్ నేతలు అందరూ ఆ మధ్యన కొన్ని రోజులు ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసారు. వారు చేసిన హడావుడికి తిరుపతిలో ఒక కాంగ్రెస్ కార్యకర్త బలయిపోయాడు కూడా. ఆ తరువాత తమ ప్రత్యేక పోరాటాన్ని జగన్మోహన్ రెడ్డికి హ్యండోవర్ చేసేసి కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు. జగన్మోహన్ రెడ్డికి కూడా చివరికి ఆయాసం, నీరసమే మిగిలింది. ప్రజల నుండి ఆశించినట్లుగా స్పందన రాకపోవడంతో ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ ఇచ్చేసారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గల్లీ గల్లీలోను కాంగ్రెస్ నేతలు ముందు వెనుకా పదేసి ఎస్కార్టు కార్లను వేసుకొని చాలా హడావుడిగా తిరుగుతూ కనిపించేవారు. నిత్యం మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుండేవారు. కానీ ఇప్పుడు తమ పార్టీని బ్రతికించుకోవడానికి పాపం...రఘువీరా రెడ్డి ఒక్కరే ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని తిరుగుతుంటే ప్రజలు గుర్తించగల ఒక్క కాంగ్రెస్ నేత అయన వెనుక కనబడటం లేదు. అయినా పిసిసి కాడి భుజానికెత్తుకొన్న పాపానికో... పుణ్యానికో..రఘువీరా రెడ్డికి మాత్రం దానిని మోయక తప్పడం లేదు. ఒయాసిస్సులో నీళ్ళు దొరకవచ్చునేమో కానీ పార్టీలో నేతల నుండి, రాష్ట్రంలో ప్రజల నుండి బొత్తిగా స్పందన కనబడటం లేదు. పైగా ఆయన ముందుకు నడుస్తుంటే వెనుక నుంచి పార్టీ ఖాళీ అయిపోతోంది. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర వ్రాసుకొనేమాటయితే, అన్ని పేజీలలో రామకోటి వ్రాసినట్లు రఘువీరా రెడ్డి పేరు మాత్రమే వ్రాసుకోవలసివస్తుంది.
మొదట్లో పార్టీలో నుండి వెళ్ళిపోతున్న వారిని ఆయన ఆపే ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు ఎవరు వెళ్లి పోతున్నా...ఎందరు వెళ్ళిపోతున్నా ఏమాత్రం చలించకుండా వెనక్కి తిరిగి చూడకుండా, రఘువీరా రెడ్డి మౌనంగా ‘ప్రత్యేక హోదా’ని భుజాన్ని మోసుకొని వెళ్లిపోతున్నారు. ఇక స్వంత పార్టీ నేతలను నమ్ముకొంటే పని కాదని భావించిన రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దువ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ డిల్లీ తీసుకొని వెళ్లి ప్రధాని నరేంద్ర మోడితో ‘ప్రత్యేక సమావేశం’ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా తమ యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో రాష్ట్రానికి ఏమేమీ హామీలు ఇచ్చిందో, ప్రత్యేక హోదా అమలు చేయాలని ఎంతగా పరితపించిపోయిందో మళ్ళీ పూస గుచ్చినట్లు వివరించారు. కానీ వినే వాళ్ళే లేరు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే సంగతి ఖచ్చితంగా తెలుసు గనుకనే ఆయన దాని కోసం ఒత్తిడి చేస్తున్నారు తప్ప నిజంగా వస్తుందని తెలిస్తే దాని ఊసు ఎత్తేవారే కాదు. ఎందుకంటే ఆ ఖ్యాతి చంద్రబాబు నాయుడుకి, నరేంద్ర మోడీకి వారి పార్టీలకి, ప్రభుత్వాలకే దక్కుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ దక్కదు. ప్రజాభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విభజించి, ప్రత్యేక హోదా ఇచ్చేము కదా! అంటే ప్రజలు వినరు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఇంతకంటే మరే అంశం లేదు కనుక రఘువీరా రెడ్డి దానితోనే కంటిన్యూ అయిపోతున్నారనుకోవాలి.
ఆయన పడుతున్న శ్రమ చూస్తుంటే ఇంతకాలం పదవులు, అధికారం అనుభవించిన కాంగ్రెస్ నేతలు మొహం చాటేస్తున్నందుకు కొంచెం బాధ కూడా కలుగుతోంది. కానీ ఎవరి లెక్కలు వారికి ఉంటాయి... ఎవరి ప్రయత్నాలలో వారున్నారనుకోవాలి అంతే. రఘువీరా రెడ్డే సర్దుకుపోతున్నప్పుడు ప్రజలు కూడా ఆ మాత్రం సర్దుకుపోలేరా...ఏమిటి?