వారి దయాదాక్షిణ్యాల వలననే హిందూ మతం సజీవంగా ఉందిట!
posted on Dec 4, 2015 @ 11:03AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ‘ద హిందు’ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారతదేశంలో హిందువులు జనాభా పరంగా అభివృద్ధి చెందడానికి ఒకప్పుడు దేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల ఔదార్యమే కారణమని అన్నారు. దేశాన్ని సుమారు 500 ఏళ్ళపాటు పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు తలచుకొంటే దేశాన్ని పూర్తిగా ముస్లిం దేశంగా మార్చగలిగేవారని, కానీ వారు ఔదార్యం చూపి హిందువులను, వారి మతాన్ని గౌరవించారని అందుకే నేడు దేశంలో హిందూమతం సజీవంగా ఉందని అన్నారు. అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఉన్న హిందువులను గమనిస్తే మొఘల్ చక్రవర్తుల మత సహనం ఎంత గొప్పదో అర్ధమవుతుందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
"ఒకప్పుడు భారతదేశానికి ముస్లింలు వచ్చేరు. ఆ తరువాత క్రీష్టియన్లు వచ్చేరు. వారందరినీ భారతదేశం తనలో కలుపుకొంది. అన్ని మతాల వారిని భారత్ సమానంగా ఆదరిస్తుంది. అదే భారతదేశానికి ఉన్న గొప్ప లక్షణం. కానీ అదిప్పుడు దెబ్బ తింటోంది. దేశంలో మత అసహనం పెరిగిపోతోంది. ఒకప్పుడు పాకిస్తాన్ జియా ఉల్-హైకోర్టు చేసిన పొరపాటునే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. నేడు పాకిస్తాన్ ఈ దుస్థితిలో ఉండటానికి కారణం మత చంధసవాదులయిన జమ్మత్-ఏ.ఇస్లామీ నేతలను ప్రభుత్వంలోకి తీసుకోవడమే!"
"మోడీ ప్రభుత్వం కూడా దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని భావిస్తోంది. కానీ మతం అనేది ఒక భూతం వంటిది. దానిని ఒకసారి బయటకు రప్పిస్తే మళ్ళీ బందించడం చాలా కష్టం. దానిని అప్పుడు ఎవరూ నియంత్రించలేరు. అదే ప్రభుత్వాలని శాసించడం మొదలుపెడుతుంది. మైనార్టీ వర్గాల మతతత్వం కంటే మెజార్టీ వర్గాల మతతత్వమే దేశానికి చాలా ప్రమాదమని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ ఆనాడే చెప్పారు. అది అక్షరాల నేటికీ వర్తిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదో ఒక మత ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మత సహనం కలిగి ఉండటమే మన దేశానికి అన్ని విధాల మంచిది,” అని అన్నారు.
దిగ్విజయ్ సింగ్ వంటి రాజకీయ నాయకులు, దేశంలో మేధావులు ప్రజలు, ప్రభుత్వం ఒక సక్రమమయిన మార్గంలో నడిపించేందుకే తమ మేధస్సును, వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తే అందరూ హర్షిస్తారు. కానీ తమ మేధస్సు, తమకున్న లోక జ్ఞానంతో ప్రజలను తప్పు మార్గం పట్టించడాన్ని ఎవరూ హర్షించలేరు.
మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమే దేశంలో ప్రజల మధ్య మత భేదాలు సృష్టిస్తోందని వాదిస్తున్న దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా తమ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికే “ఊహాజనితమయిన మత అసహనం” అనే పదాన్ని సృష్టించి దానికి విస్తృతంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్న భిన్న మతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన సంఘటనకి కాంగ్రెస్ బాధ్యత వహించాలి. కానీ దానికీ మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ వాదించడం గమనించినట్లయితే అది ఉదేశ్యపూర్వకంగానే ఈ విష ప్రచారం చేస్తోందని అర్ధమవుతోంది. అందుకోసం దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు చరిత్రను కూడా వక్రీకరించడానికి వెనుకాడక పోవడం చాలా శోచనీయం.
భారతదేశంపైకి అధికారం చెలాయించిన మొఘలులు ఉదారంగా వ్యహరించడం వలననే హిందువులు, వారి సంస్కృతి ఇంకా బ్రతికి ఉందని దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా అవమానకరంగా ఉంది. భారతదేశంపై, దేశ సంస్కృతీ సంప్రదాయాలపై విదేశీయులు చేసిన దాడులు ఆయన కళ్ళకి కనబడలేదు. గజనీలు, ఘోరీలు గుళ్ళు గోపురాలను ద్వంసం చేయడం, నలందా వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయంలో అమూల్యమయిన గ్రంధాలను తగులపెట్టడం, దేశ సంపదను దశాబ్దాల తరబడి దోపిడీ చేసి తమ దేశాలకు తరలించుకుపోవడం వంటి అనేక అకృత్యాలు భారతీయుడయిన దిగ్విజయ్ సింగ్ కళ్ళకి కనబడకపోవడం చాలా విచిత్రమే.
కానీ తమ పార్టీ వాదనలకు పనికివచ్చే వారిలో మంచిని మాత్రం ఆయన స్వీకరించి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు. మొఘలులు లేదా బ్రిటిష్ వాళ్ళ బారి నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఎన్ని లక్షల మంది ప్రజలు, సైనికులు, వీరులు, రాజులు తమ ప్రాణాలను తృణప్రాయంగా బలిచేసారో ఆయన చెప్పకపోవచ్చును కానీ ప్రజలకు ఆ సంగతి తెలుసు. అలనాడు మహా రాణా ప్రతాప్, చత్రపతి శివాజీ మొదలుకొని తరువాత కాలంలో సుబాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రు, అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో మహనీయులు, అనామక ప్రజలు కలిసి చేసిన ఎన్నో పోరాటాల కారణంగానే భారతదేశం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడబడ్డాయి తప్ప ఎవరో దయాదర్మాల వలన కాదనే సంగతి బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమికొట్టిన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నేతకు తెలియదనుకోవాలా లేక తెలిసీ ఈవిధంగా మాట్లాడుతున్నారు అంటే తమ పార్టీ ప్రయోజనాల కోసం అవసరం లేని చరిత్రను తవ్వి తీసి చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారనుకోవాలా?
నిజానికి మత అసహనం పేరిట బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బ తీసి మళ్ళీ దేశంలో తమ పార్టీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాల వలననే దేశానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. ఒకప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన మనుగడ కోసం, తన వారసుడి రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం మొదలుపెట్టిందని అందరికీ తెలుసు. కానీ వారు చేస్తున్న ఈ దుష్ప్రచారం వలన ప్రపంచ దేశాలు భారత్ ని అనుమానంగా చూసే పరిస్థితి కలిపిస్తున్నారని దాని వలన అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బ తింటుందని గ్రహిస్తే బాగుంటుంది. భారత్ కంటే కాంగ్రెస్ పార్టీకి తమ ప్రయోజనాలే ముఖ్యమనుకొంటే అటువంటి పార్టీ భారత్ కి అవసరం లేదని ప్రజలు మరొకమారు తప్పక రుజువు చేస్తారు.