రఘువీరాపై నిప్పులుచేరిగిన జేసీ
posted on Mar 26, 2011 @ 2:11PM
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డిపై మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుని ఉన్నారని ధ్వజమెత్తారు. నేను విషపు పురుగునైతే ఇలాంటి వారంతా ఎమ్మెల్యేలు అయ్యేవారు కాదని దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓ పెద్దమనిషి తనను విషపుపురుగా అభివర్ణించడమే కాకుండా, మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారన్నారు. నేనే లేకపోతే రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసే వారేకాదన్నారు. అలాగే మంత్రి శైలజానాథ్ గెలుపు వెనుకా తన కృషి ఉందన్నారు. వైఎస్ఆర్ దగ్గర తన గురించి చాలా దుష్ప్రచారం చేసి మంత్రిపదవి రాకుండా అడ్డుకున్నారన్నారు. అంతేకాకుండా, వైఎస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని తొలిసారి ప్రతిపాదన చేసిన ఘనుడు రఘువీరా రెడ్డి అని అన్నారు.
జగన్ బుర్రకు ఈ ఆలోచనా వచ్చిందో లేదో తెలియదు గానీ రఘువీరా రెడ్డి మాత్రం తొలి ప్రతిపాదన చేశారన్నారు. అలాగే, రోశయ్య మంత్రివర్గంలో చేరబోనని ప్రకటించి.. చివర నిమిషంలో ఉరుకులు పరుగుల మీద వెళ్లి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి తనపై విమర్శలు చేయడమా అని జేసీ ప్రశ్నించారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్ పార్టీలో పుట్టిపెరిగానన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబాలకు విధేయుడిగానే ఉంటానన్నారు. తాను చచ్చిపోయేంత వరకు కాంగ్రెస్ వాదిగానే ఉంటానని జేసీ స్పష్టం చేశారు. పార్టీ నుంచి తనను ఎవరూ బయటకు పంపలేరన్నారు. తనకు పదవులు ఇచ్చినా ఇవ్వక పోయినా గుర్తింపు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌లోనే ఉండిపోతానని మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు.