మరీ ఇంత దారుణమా.. తప్పతాగి జూనియర్ పై 25 మంది మెడికోల ర్యాగింగ్
posted on Jan 3, 2022 @ 11:03AM
తెలంగాణలోని సూర్యాపేట మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థి చెప్పిన వివరాలు విన్నవారు షాకవుతున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని అవాక్కవుతున్నారు. మెడికల్ స్టూడెంట్స్ గా ఉంటూ ఇంత కిరాతకంగా ఎలా ఉంటారనే చర్చ కూడా వస్తోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు కదిలిపోయారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన బాధిత విద్యార్థి సూర్యాపేట మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లిన అతడు శనివారం రాత్రి హాస్టల్ కు చేరుకున్నాడు. అప్పటికే సెకండ్ ఇయర్ చదువుతున్న 25 మంది మెడికోలు మద్యం తాగి ఉన్నారు. జూనియర్ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్లుగా వినాలని హెచ్చరిస్తూ.. తమ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతడి దుస్తులు విప్పించి సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం అతడికి గుండు గీసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిఘటించిన సదరు విద్యార్థి వారి నుంచి తప్పించుకొని తన రూంకు వెళ్లాడు.
అనంతరం తండ్రికి ఫోన్ చేసిన తనకు ఎదురైన పరిస్థితి గురించి చెప్పాడు. దీంతో బాధితుడు తండ్రి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన స్థానిక పోలీసులు హాస్ట్లల్ కు చేరుకొని టెన్షన్ లో ఉన్న బాధితుడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే బాధిత విద్యార్థిని స్టేషన్ కు తరలించిన పోలీసులు.. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ మెడికోల మాత్రమే చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై బాధితుడి తండ్రి ఫైరవుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం విద్యార్థులు ఘర్షణ పడ్డారని.. ర్యాంగింగ్ కు పాల్పడినట్లుగా ఆధారాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమని తేలితే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెబుతామని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ర్యాంగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.