కేసుల భయమా? ఎన్నికల చర్చలా? జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు?
posted on Jan 3, 2022 @ 11:33AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. మూడు రాజధానుల అంశం, అమరావతి భవిష్యత్, పోలవరం, విభజన హమీలు, ప్రత్యేక హోదాపై కేంద్రం పెద్దలతో సీఎం జగన్ చర్చిస్తారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏపీ సమస్యలపై కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలోనూ జగన్ చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారని, కాని ఏపీ కోసం ఏమైనా సాధించారా అని ప్రశ్నిస్తున్నారు. వరదలతో వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగినా.. కేంద్రం ఇంతవరకు రాష్ట్రానికి పైసా విదల్చలేదని చెబుతున్నారు. తన సొంత అవసరాల కోసం ఏపీ ప్రయోజనాలను జగన్ ఢిల్లీకి తాకట్టు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తాజా ఢిల్లీ పర్యటన ఏపీలో కాక రాజేస్తోంది.
ఏపీ ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో మొదటిది ఆర్థిక సమస్యలు. ఇప్పటికిప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకునే బాండ్ల అప్పుల కోసం అనుమతి రావాల్సి ఉంది. ఇవాళ అది రాకపోతే మంగళవారం ఆర్బీఐ వేసే బాండ్ల వేలంలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. అదే జరిగితే ఇప్పటికీ జీతాలు, పెన్షన్లు అందని వారికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనేది పెద్ద సమస్య అవుతుంది. ముందు ఈ గండం అధిగమించాలి. భారీ వర్షాలు - వరదల కారణంగా ఏపీలోని మూడు జిల్లాలు భారీగా నష్టపోయాయి. దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిట్లింది.అయితే రెండు రోజుల క్రితం కేంద్రం వరదల కారణంగా నష్టపోయిన ఇతర రాష్ట్రాలకు సాయం ప్రకటించింది. ఏపీ ఊసెత్తలేదు. ప్రధాని హామీ ఇచ్చారని .. సీఎం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని లేఖ రాసినా స్పందన లేదు. ఈ అంశం పైనా సీఎం చర్చించే ఛాన్స్ ఉంది.
అయితే జగన్ పర్యటనలో రాష్ట్ర సమస్యల కంటే రాజకీయ అంశాల పైన సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో తీర్పు రిజర్వులో ఉంది. ఆ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన రాజీనామా చేసే అవకాశాలుంటాయి. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వ్యతిరేక తీర్పు వచ్చినా జగన్ పదవికి గండమే. ఒకవేళ హైకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించారు ఎంపీ రఘురామ. ఇది కూడా జగన్ కు ఇబ్బందికరమే.
వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని అంటున్నారు. ఫ్యామిలీలో జగన్ ఒంటరి అయ్యారని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఇడుపాలపాయకు వెళ్లిన జగన్... కుటుంబంతో కాకుండా సింగిల్ గానే వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ కూడా ఆయనతో కనిపించలేదు. ఇడుపుల పాయ గెస్ట్ హౌజ్ లో జగన్ తో షర్మిల గొడవ పడ్డారని, రాత్రికి రాత్రే అక్కడినుంచి వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఆస్తి విషయంలో కొన్ని రోజులుగా జగన్ తో గొడవ పడుతున్న షర్మిల.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిందని అంటున్నారు. ఇన్ని సమస్యలు ఉన్న జగన్ కు వైఎస్ వివేకా హత్య కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యం చెప్పమని సీబీఐ అధికారులు షర్మిలను సంప్రదించారని తెలుస్తోంది. దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని.., స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని సమాచారం.
వివేకా హత్య కేసులోకి భారతీరెడ్డిని షర్మిల లాగేసిందని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో బయటకు తీసిన సీబీఐ.. వారిలో భారతీరెడ్డి కూడా ఉన్నారని తేల్చారట. దీంతో భారతీరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. భారతీరెడ్డికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలను సీబీఐకి చెప్పేందుకు షర్మిల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దీంతో వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చేధిస్తే .. జగన్ కు అక్రమాస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యే అవకాశ ఉందంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు తేలుతాయో లేదో కానీ ఈడీ కేసులు మాత్రం త్వరలోనే తేలిపోతాయన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో తన కేసుల గురించే కేంద్ర పెద్దలతో మాట్లాడేందుకు జగన్ హస్తినకు వెళ్లారని విపక్షాలు అరోపిస్తున్నాయి. కేసులు కీలక దశకు రావడంతో ఎలాగైనా భయటపడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు చేస్తున్నాయి.