క్వారంటైన్ ఫుడ్ టెండర్‌లలో గోల్‌మాల్?
posted on Apr 21, 2020 @ 10:07AM
సందట్లో సడేమియాలు తమ నైజం బయటపెడుతున్నారు. శవాల మీద చిల్లర ఎరుకుంటున్నారు. క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారికి భోజన, ఫలహారాలు అందజేసే విషయంలో కాంట్రాక్టర్లతో లాలూచి పడి అందినంత దండుకుంటున్నారని ఉన్నతాధికారులకు ఆదారాలతో ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు, అధికారులు బాగానే క్వారంటైన్ భోజనాల్లో బాగానే వెనకేసుకుంటున్నారట. చచ్చినాడి పెళ్లికి వచ్చినంత కట్నం అనుకూంటూ వెనుకేసుకుంటున్నారట.
క్వారంటైన్‍లో ఉంటున్న కరోనా వ్యాధి అనుమానితులకు ప్రభుత్వం తరఫునే ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఉదయం నుండి రాత్రి వరకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. కొంతమందికి సరఫరా చేస్తున్న భోజనాలు, ఫలహారాల విషయంలో నాణ్యత ఉండటం లేదని.. వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని వివిధ జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఫిర్యాదులు అందుతున్నాయి.
క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నవారికి మెనూ ప్రకారం ఉదయం 6.30గం.లకు రాగిజావ, 7.00గం.లకు టీ లేదా కాఫీ 7.30గం.ల నుండి 8.00గం.ల వరకు రెండు రకాల టిఫిన్లు, 11.00గం.లకు ఫ్రూట్ సలాడ్ ఇవ్వాలి. మధ్యాహ్నం 12.00 గంటలకు రెండు శాఖాహార కూరలతో భోజనం పెట్టాలి. సాయంత్రం 4 గంటలకు టీతో పాటు స్నాక్స్ ఇవ్వాలి. రాత్రి 7 గంటలకు రెండు రకాల కూరలతో భోజనం పెట్టాలి. అలాగే గదులలో 20 లీటర్ల నీళ్ల బాటిళ్లు ఇతరత్రా సమకూర్చాలి. వీటన్నింటిని సమకూర్చేందుకు కాంట్రాక్టర్లను పిలవాల్సిన అదికారులు, స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఉన్న అన్ని క్వారంటైన్ కేంద్రాలలో.. పైన పేర్కొన్న మెనూ ప్రకారం కరోనా అనుమానితులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పారిశుద్య నిర్వహణ, విపత్తుల విషయంలో ప్రభుత్వ పరంగా సహకారం కోసం జిల్లా ముఖ్య అధికారులు ఎప్పటి కప్పుడు హోటళ్ల యజమానులను పిలిచి సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్వారంటైన్లలో ఉంటున్న వారికి పెద్ద మొత్తంలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని జిల్లాలలో హోటళ్ల అసోసియేషన్ ఉన్నప్పటికీ.. వారితో సంప్రదించకుండా.. ఇతర వ్యాపారులతో ఈ ఆహార పదార్ధాలను అధికారులు సరఫరా చేయించడం వివాదాస్పదం అయింది.
ఈ వ్యవహారంపై హోటళ్ల యజమానులు ఆధారాలతో జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు.
ఓపెన్ టెండర్ల ద్వారానే క్వారంటైన్ ఫుడ్ ఆర్డర్స్ ఫైనల్ చేశారు. టెండర్లలో ఎక్కడా అక్రమాలు జరగలేదని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ పక్రియను దగ్గరుండి పరీక్షించారని, ఇందుకు సంబందించిన వివరాలున్న ఫైళ్లు కలెక్టర్ దగ్గరే ఉన్నాయని ఎవరికైనా అనుమానాలు ఉంటే… తెలుసుకోవచ్చని… కార్వంటైన్లు నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు.