కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ
posted on Dec 20, 2022 @ 5:16PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ భేటీ కానున్నారు. హైదురాబాద్ లో నేడు జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన పంజాబ్ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ లో ఆయనతో భేటీ అయ్యారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తరువాత వీరిరువురూ కలవడం ఇదే తొలిసారి.
ఈ భేటీలో ఇరువురి మధ్యా జాతీయ రాజకీయాలపై చర్చ జరిగిందని అంటున్నారు. దేశ రాజకీయాలపై ఇరువురూ అభిప్రాయాలు పంచుకున్నారని చెబుతున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కనీసం అటువైపు చూడలేదు సరికదా.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హస్తిన వీధుల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలిగించేశారు.
ఈ నేపథ్యంలోనే భగవంత్ సింగ్ మాన్ ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నాటక, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మినహా ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెప్పుకోదగ్గ నేతలెవరూ రాలేదు. ఆహ్వానం అందినా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన నాయకులు కూడా బీఆర్ఎస్ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. కనీసం శుభాకాంక్సలు తెలిపిన దాఖలాలు కూడా లేవు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేసీఆర్ ఆహ్వానం మేరకే అయినా ప్రగతి భవన్ కు వెళ్లి ఆయనతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా భేటీ కేవలం 20 నిముషాలలోనే ముగిసింది. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సహా పలు అంశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగిందని అంటున్నారు.