ప్రభుత్వంపై ప్రజాపద్దులసంఘం ఆగ్రహం
posted on Jul 6, 2012 @ 10:24AM
పులిచింతల ప్రాజెక్టు గుత్తేదార్లపై చర్య తీసుకోవాలని విజిలెన్స్ చేసిన సిఫార్సును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రభుత్వంపై ప్రజాపద్దుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభాకమిటీ హాలులో ఛైర్మన్ రేవూరి ప్రకాశరెడ్డి అథ్యక్షతన సమావేశమైన పీఎసి కల్వకుర్తి ఎత్తిపోతల, పులిచింతల ప్రాజెక్టు గురించి చర్చించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణ వ్యయం 2788 కోట్ల రూపాయల్లో 80శాతం చెల్లింపులు పూర్తయినా నీరెందుకు విడుదల చేయలేదని సభ్యులు ధ్వజమెత్తారు. చెల్లింపులు తప్పించి ప్రజోపయోగమైన ఈ ప్రాజెక్టుల పరిస్థితి గమనించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్టు గుత్తేదార్లతో అధికార్లు కుమ్మక్కు అయ్యారని విజిలెన్స్ గుర్తించి చర్యలకు సిఫార్సు చేస్తే ప్రభుత్వాన్ని దాన్ని పట్టించుకోకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన సమగ్రమైన నివేదికను ఒక్కరోజులో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమార్కులను వదిలేయటానికి ఒప్పుకోమని కూడా హెచ్చరించారు.