కర్ణాటకలో హస్తానికి ఎదురు గాలి.. తెలంగాణకు ముందస్తు హెచ్చరిక
posted on May 26, 2025 6:49AM
దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మూడే మూడు. అందులో ఒకటి తెలంగాణ. తెలంగాణలో పరిస్థితి ఏమిటో ప్రత్యేకంచి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పడు కాదు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హస్తం పార్టీ ఓటమి తధ్యమని హస్త సాముద్రిక పండితులు స్పష్టంగా చెపుతున్నారు. నిజానిక హస్త సాముద్రిక పండితులను, రాజకీయ విశ్లేషకులను అడగవలసిన పని లేకుండానే, కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను గమనిస్తే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అయ్యేపని కాదని, సామాన్యులకే అర్థమైపోతుంది.
సరే, తెలంగాణ విషయాన్ని పక్కన పెట్టి, గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్రోహదం చేసిన కర్ణాటకలో పరిస్థితి ఏమిటని చూస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటక కాంగ్రెస్ ‘చేయి’ జారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ సర్వే సంకేతాలు ఇస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ పేరిట నిర్వహించిన సర్వే ఫలితాలు అదే సూచిస్తున్నాయి.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష బీజేపీకి 51 శాతం ఓట్లతో 136-159 స్థానాలు కైవశం చేసుకుంటుందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ 40.3 శాతం ఓట్లతో 62-82 స్థానాలు, జేడీ(ఎస్) 5 శాతం ఓట్లతో 3-6 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని, పీపుల్స్ పల్స్ సర్వే చెపుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాలలో 10 శాతానికి పైగా ఓట్లు కోల్పోయింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వం రెండేళ్లలో పాలనలో ప్రభుత్వ వ్యతిరేక జరజరా పాకుతూ పైపైకి పోతోందని సర్వే సూచిస్తోంది. మరో వంక.. ప్రతిపక్ష బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. సో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే తేల్చి చెప్పింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదు. డీకే శివకుమార్ ఉండనిస్తే.. సిద్దరామయ్య సర్కార్ మరో మూడేళ్ళు అధికారంలో ఉంటుంది. కానీ, ఆడుతూ పడుతూ హనీమూన్ లా సాగవలసిన తొలి రెండేళ్ళలోనే మోయలేనంత ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముందున్న మూడేళ్లూ క్రొకోడైల్ ఫెస్టివల్ తప్పదని అంటున్నారు.
నిజానికి.. 1985 నుంచి గడచిన నాలుగు దశాబ్దాల రాష్ట్ర ఎన్నికల చరిత్రను చూస్తే.. కర్ణాటక ప్రజలు ఒక సారి గెలిపించిన పార్టీని వరసగా రెండవ సారి గెలిపించిన సందర్భం లేదు. ప్రతి ఐదేళ్లకోసారి, ప్రభుత్వాన్ని మార్చడం కర్ణాటక రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తోంది. సో ... సర్వే ఏమి చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో ఏదో మహాద్భుతం జరిగితే తప్ప కాంగ్రస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా రెండేళ్లకే చేతులెత్తేసిన సిద్దరామయ్య సర్కార్, ఐదేళ్ళ తర్వాత తిరిగి అధికారంలోకి రావడం అయ్యే పని కాదని సర్వేలే కాదు సామాన్యులు కూడా చెపుతున్నారు.
అదొకటి అయితే.. కర్ణాటక సర్వే నుంచి తెలంగాణ ప్రభుత్వం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది చాలనే ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలంగాణ,కర్ణాటక రెండూ ఇరుగుపొరుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో వుంది. అంతే కాదు, రెండు రాష్ట్రల్లోనూ ఇంచుమించుగా ఒకే విధమైన గ్యారెంటీలు, హమీలతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొంతలో కొంత మెరుగ్గా అమలు చేస్తోంది. అయినా, పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు సహా ఏ వర్గం ప్రజల్లోనూ ఆశించిన ఆదరణ లభించడం లేదు. మహిళా ఓటర్లలో బీజేపీకి 48.4 శాతం, కాంగ్రెస్ కు 44.6 శాతం మద్దతు లభిస్తుండడంతో కాంగ్రెస్ పై బీజేపీ మహిళా ఓటర్లలో 3.8 శాతం ఆధిపత్యం కనబరుస్తోంది. పురుష ఓటర్లలో బీజేపీ 51.9 శాతం, కాంగ్రెస్ 38.9 శాతం ఓట్లు సాధిస్తుండడంతో.. బీజేపీ కాంగ్రెస్ పై 13 శాతం భారీ ఆధిక్యత చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.18-25 సంవత్సరాల ఓటర్లలో బీజేపీ 24 శాతం ఆధిక్యతను కొనసాగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ, గత (2023) ఎన్నికల్లో రైతు సంక్షేమానికి సంబంధించి అనేక హమీలను ఇచ్చింది. సానుకూల ఫలితాలు సాధించింది. కొన్ని పథకాలను అమలు చేసింది. అయినా.. గ్రామీణ ప్రాంతలో ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీల్లో కాంగ్రెస్ ఆదరణ దినదినాభివృద్ధిగా దిగజారుతోందని సర్వే సూచిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో 13.5 శాతం, పట్టణాల్లో 6.6 శాతం కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఆధిక్యంలో వుంది. రైతుల్లో బీజేపీకి 53.9 శాతం, కాంగ్రెస్ కు 37.4 శాతం ఓట్లు లభించవచ్చని సర్వే సూచిస్తోంది.
నిజమే.. పీపుల్స్ పల్స్ సంస్థ పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ సర్వే ద్వారా కర్ణాటక ప్రజల నాడి పట్టి చూసింది. అయితే.. కర్ణాటక తెలంగాణల మధ్య అనేక విషయాల్లో సారుప్యత ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు కూడా ఇదో హెచ్చరికని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ తెలంగాణ కంటే ఐదారు నెలలు ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.. ఐదారు నెలల తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపునకు ద్రోహదం చేసింది.. సో.. కర్ణాటక సర్వే కర్నాటకకే పరిమితం కాదు. తెలంగాణకుకూడా ఒక సంకేతమే, ఒక హెచ్చరికే అంటున్నారు.