చిరుతో కాంగ్రెస్ చెడుగుడు ..?
posted on Dec 20, 2011 @ 10:44AM
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవితో రాష్ట్రంలోని కాంగ్రెసు నాయకులు పావుగా వాడుకున్నారనే ప్రచారం సాగుతోంది.రాజకీయానుభవం తక్కువగా ఉన్న చిరంజీవిని ఇప్పుడు నాయకులు చెడుగుడు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడడానికి చిరంజీవిని వాడుకుని చిరంజీవి తమకు అడ్డు రాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తులు పైయెత్తులు వేస్తున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాల్సి వస్తే ముఖ్యమంత్రి పదవికి తనతో పోటీ పడకుండా ఉండడానికి బొత్స సత్యనారాయణ చిరంజీవిని ఢిల్లీకి పంపించాలని ఆలోచిస్తుండగా, బొత్సకు చెక్ పెట్టడానికి చిరంజీవిని రాష్ట్రంలో ఉంచాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.తన 17 మంది శానససభ్యులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిలబెట్టిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. అయితే, ఆ సమయంలో అలక వహించి, కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో బతిమాలించుకోవడం వల్ల చిరంజీవి ప్రతిష్ట కొంత తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి బొత్సపైనే కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. చిరంజీవిని బొత్స సత్యనారాయణ ఎగేశారని, అందువల్లనే చిరంజీవి బెట్టు చేశారని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం.
బొత్స సత్యనారాయణ తరుచుగా చిరంజీవితో సమావేశమవుతూ తాను మాత్రమే సన్నిహితుడిని అనే అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రకంగా చిరంజీవిని బుట్టలో వేసుకున్నట్లు సమాచారం. చిరంజీవితో అత్యంత సన్నిహితంగా మెలుగుతూనే తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని, చిరంజీవిని పక్కకు తప్పించాలని వ్యూహం పన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు రాజకీయాల్లో చిరంజీవితో పాటు ఆయన శాసనసభ్యులు కూడా తీవ్ర నిరాశకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని వాడుకుంటూ అలా వదిలేస్తారా, తగిన స్థానం కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే.