ప్రపంచము-శాంతి అంతిమ లక్ష్యమేంటి?

శాంతి అనేది ఎన్నో జీవితాలను సమస్యల నుండి బయట పడేస్తుంది. ఎలాంటి భయాందోళనలు లేని జీవితం గడిపేలా చేస్తుంది. అందుకే ఎందరో ప్రముఖులు శాంతి కోసం పోరాడారు. ప్రపంచానికి శాంతి కావాలని, అదే ప్రపంచాన్ని ఉన్నతంగా నిలబెడుతుందని. శాంతి వల్లనే అన్ని దేశాలు, అన్ని వర్గాలు ప్రజలు తమ జీవితాన్ని తాము హాయిగా గడపగలుగుతారు. 

 ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ శాంతి దినోత్సవం రోజు ఐక్యరాజ్యసమితి 24 గంటల పాటు ఎక్కడా హింస, పీడించడం,  కాల్పులు జరపడం వంటివి చేయకూడదని. దీని ద్వారా కలిగే చిన్నపాటి మార్పు ప్రజలలో ఆలోచనను రేకెత్తి ఆ మార్పు దీర్ఘకాలం వైపు మరలేలా అడుగులు పడటానికి మూలమవుతుందని నిర్ణయించింది. ఈ విధంగా  శాంతి దినోత్సవాన్ని పాటించడం ద్వారా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడానికి  సాధ్యమవుతుంది. 

 ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు హింసాత్మకమైన, రక్తపాతమైన గతాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాలలో కొన్ని తమ దేశ పౌరుల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును, ప్రపంచంలో వారి మనుగడను దృష్టిలో ఉంచుకుని తమ ధోరణి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, శాంతి దినోత్సవాన్ని తమలో అంతర్భాగం చేసుకోవడానికి, ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావడానికి ముందడుగు వేస్తున్నాయి. అయితే మరికొన్ని దేశాలు మాత్రం సరిహద్దులలో ఉన్న ఇతర దేశాలతో హింసాత్మకంగా కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతికి భంగం కలిగిస్తుంటాయి. 

ఇలాంటి వాటిని అరికట్టడానికే ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ శాంతి దినోత్సవ చరిత్ర ఏమిటి?? 

1981లో ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం చేయబడింది.ఆ తరువాత ఇరవై సంవత్సరాలకు ప్రపంచంలో చాలా దేశాలు శాంతి దినోత్సవం వైపు అడుగులు వేసాయి. 

శాంతి దినోత్సవం మాట!!

చివరి ఏడాది కరోనా విలయతాండవం చేస్తుండటంతో కరోనా నుండి ప్రపంచం కోలుకోవాలనే థీమ్ తో శాంతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే 2022 సంవత్సరంలో శాంతి దినోత్సవాన్ని జాత్యహంకారం నశించాలనే నినాదంతో జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచంలో ఎన్నో దేశాలలో జాతి, వర్గ బేధాలను అనుసరించి మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. దేశాలు, దేశాల మధ్య ఏర్పడిపోయే ఈ అభద్రాభావ చర్య మనుషుల్ని, సమాజాన్ని, సరిహద్దు ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారిని భయాందోళనలో నెట్టేస్తాయి.

శాంతి బహుమతి!!

ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసిన వారికి, అహింస కోసం పోరాడిన వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ శాంతి బహుమతి 1901లో అందించారు. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు, సౌబ్రాతృత్వం కోసం దేశాల మధ్య పగలు, శత్రుత్వాలు తగ్గించే దిశగా కృషి చేసేవారికి శాంతి బహుమతి అందజేయడం జరుగుతుంది. 

ప్రశాంత దేశం!!

ప్రపంచంలో అత్యంత ప్రశాంత దేశంగా 2008లో ఐస్ ల్యాండ్ గుర్తించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాని స్థానాన్ని అది నిలబెట్టుకుంటూ వస్తోంది. 

కొన్ని ఆసక్తికర విషయాలు!!

2015లో హింస వల్ల జరిగిన ఆర్థిక వ్యయం 13.6 ట్రిలియన్లు.

 సెప్టెంబర్ 2015 నాటికి హింసాత్మక విషయాలను కలిగి ఉన్న ఉగ్రవాద వెబ్‌సైట్‌ల సంఖ్య 9,800 గా ఉంది. ఇవన్నీ హింసను ప్రేరేపిస్తాయ్.

 1992 మరియు 2019 మధ్య మహిళా సంధానకర్తల శాతం 13%.

1992 మరియు 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శాంతి ప్రక్రియల్లో సంతకం చేసిన మహిళల శాతం 6%. 

 2015 మరియు 2019 మధ్య కాల్పుల విరమణ ఒప్పందాల శాతం11%. ఇందులో లింగ నిబంధనలు కూడా ఉన్నాయి.

 ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభం కారణంగా యెమెన్ జనాభాలో అంచనా వేసిన వారి సంఖ్య 15.9 మిలియన్లు. 

 2019లో తీవ్రమైన ఆకలితో జీవిస్తున్న వారి సంఖ్య 135 మిలియన్లు. 

 సంఘర్షణ చెందుతున్న  దేశాలలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వ్యక్తుల శాతం 60%

 అక్టోబర్ 2020 నాటికి మహిళలు, శాంతి  భద్రతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉన్న దేశాల సంఖ్య 88. 

  COVID-19 సంక్షోభానికి ప్రతిస్పందనగా జాతీయ ప్రభుత్వాలు రూపొందించిన విధాన చర్యల సంఖ్య 417. 

  2016లో సాయుధ పోరాట ప్రాంతాల్లో నివసిస్తున్న యువత 408 మిలియన్లు అని అంచనా.

ఇకపోతే ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా అందరూ తెలుసుకోవలసిన విషయాలు.

ప్రపంచం, ప్రపంచం చుట్టూ ఉన్న పరిస్థితులు, విషయాలు అన్నీ తెలుసుకుని వాటిని అర్థం చేసుకోవాలి. 

ఆర్థిక, ఆహార భద్రతను సామాజిక పరంగా దృడం చేసుకోవాలి.

అన్ని రకాల, అన్ని వయసుల వారికి కేటాయించబడిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి.

సమానత్వం కోసం, సమన్యాయం కోసం పోరాడాలి.

ప్రజాస్వామ్య నిర్ణయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఉద్దేశ్యాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి.

                                       ◆నిశ్శబ్ద.

Advertising
Advertising