పీకే కాంగ్రెస్ లో చేరడం ఖాయమేనా?
posted on Sep 2, 2021 @ 7:16PM
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఆ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన (?) ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిశోర్ పేరు దేశ రాజకీయాలలో మారు మ్రోగి పోయింది. అదే సమయంలో ఆయన ఇదీ అని ఏదీ చెప్పకుండానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో మొదలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంకావాద్రా వరకు వివిధ పార్టీల నాయకులను కలిశారు. మోడీని ఓడించడం ఎలా, అనే విషయంలో విపక్షాలకు బోలెడంత జ్ఞాన బోధ చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ప్రతిపక్షాలు సాగించిన ఐక్యత క్రతువుకు తెరవెనక సూత్రధారిగా వ్యవహరించారు. పౌరోహిత్యం నెరిపారు. అ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, ఎక్కడ ఆగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షాల ఐక్యత అనే ఎండమావి, ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నట్లుంది. పక్షం రోజుల క్రితం ఎప్పుడో సోనియా గాంధీ ఒక వర్చువల్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు, ఎవరి రాజకీయం వారిది, అన్నట్లుగా పనిలో పడిపోయారు.
బీజేపీకీ, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా వ్యూహ రచన సాగిస్తూనే, మరో వంక కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేశారు, ఆ కోణంలోనూ సోనియా, రాహుల్, ప్రియాంక త్రయంతో చర్చలు జరిపారని, అప్పట్లో వార్తలొచ్చాయి. అలాగే, ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనపై కమల్ నాథ్, తదితర సీనియర్ నాయకులతో సొనియా,రాహుల్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ సమావేశంలోనే పీకే ఎంట్రీకి కాంగ్రెస్ నాయకులు ఓకే చెప్పారు. ఆయనకు ఏ బాధ్యతలు ఇవ్వాలి, అయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలో సోనియా గాంధీ నిర్ణయిస్తారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే,అ తర్వాత ఏమైందో ఏమో కానీ, పీకీ కాంగ్రెస్ ఎంట్రీ స్టొరీ బ్రేక్ తీసుకుంది.
ఇప్పడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, సోనియా గాంధీ, పీకేకు గ్రీన్ సింగల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ లో ఒక వర్గం మాత్రం పీకే ఎంట్రీనే వ్యతిరేకిస్తుంటే, మరికొందరు, ఆయనకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వేలులేదని అంటున్నట్లు సమాచారం. గతంలో జేడీయూలో చేరి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినా, పార్టీ అధ్యక్షుడు నితీష్ కుమార్’తో విబేధించి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదీగాక తానూ రాజకీయలకు పనికిరానని స్వయంగా ప్రకటించుకున్న ఆయనకు పార్టీ పెద్ద పీట వేయడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెపుతున్నారు. మరో వంక కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ విధానలను అవలంబించడం అంత తేలికైన విషయం కాదని, స్వయంగా ప్రశాంత్ కిశోర్ ఓపెన్’గానే కామెంట్ చేశారు.
ఇక ప్రశాంత్ కిశోర్ వద్ద మంత్రం దండం ఏమీ లేదు. జాతీయ స్థాయిలో 2014లో బీజేపీ విజయానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం కంటే అంతకు ముందు పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇతరత్రా కారణాలు కీలక పాత్రను పోషించాయని కాంగ్రెస్ నాయకులే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అదే సమయంలో, ఉత్త ప్రదేశ్, బీహార్ , ఢిల్లీలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు పనిచేయని విషయాన్ని కూడా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి, పీకే ఇంతవరకు గెలిపించిన(?) పార్టీలు అన్నీ కూడా, ఆయన వ్యూహం లేకున్నా గెలిచేవే అని అంటున్నారు. నిజంగా, ప్రశాంత్ కిశోర్’ కు తమ వ్యూహ చతురత మీద నమ్మకం ఉంటే, రేపటి యూపీ అసెంబ్లీ ఎన్నుకలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ నాయకులే సవాలు విసురుతున్నారు. రాజకీయాలలో ఎన్నికల వ్యూహాలు ఎత్తుగడలు కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. పార్టీ నిర్మాణమే సరిగా లేని చోట, పీకే అయినా ఇంకెవరైనా పీకేది ఏమీ ఉండదని ,అంటున్నారు. అయితే. పేకే వ్యూహం అసలే పనిచేయదని కాదు, అదొక్కటే, గట్టేకించలేదు. ఇతర అంశాలన్నీ సానుకూలంగా ఉన్నప్పుదు మాత్రమే పేకే వ్యూహం పనికొస్తుందని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. అందుకే ఆయన్ని అంతగా ఎత్తుకోవలసిన అవసరం లేదని అన్నారు