తప్పు మీద తప్పు.. కోమటిరెడ్డిని క్షమిస్తారా? శిక్షిస్తారా?
posted on Sep 2, 2021 @ 10:13PM
అధిష్టానం వద్దంది. అక్కడకు వెళ్లొద్దని హుకుం జారీ చేసింది. వెళితే మంచిగుండదని హెచ్చరించింది. అంతా హైకమాండ్ మాట విన్నారు. కానీ, ఒక్కరు మాత్రం రెబెల్ జెండా ఎగరేశారు. తాను అక్కడకు వెళ్లి తీరుతానంటూ ఉదయమే మెసేజ్ ఇచ్చేశారు. సాయంత్రం అన్నట్టుగానే ఆ సభకు వెళ్లారు. వైఎస్సార్‌ను వేనోళ్ల పొగిడారు. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. విజయమ్మ నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సంస్మరణ సభకు కోమటిరెడ్డి హాజరుకావడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. పదే పదే పార్టీ లైన్‌ను ఉల్లంఘిస్తూ.. పదే పదే రెబెల్ వాయిస్ వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీరుపై హస్తం పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉందని అంటున్నారు.
ఏఐసీసీతో చర్చించి ఉదయమే పీసీసీ ఓ ప్రకటన చేసింది. షర్మిల పార్టీ పెట్టిందే కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి కాబట్టి.. ఆమె ఆధ్వర్యంలో జరిగే వైఎస్సార్ సంస్మరణ సభకు కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లొద్దని హుకూం జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం తాను వెళ్లితీరుతానని ఆ వెంటనే ప్రకటించడం కలకలం రేపింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించి.. అన్నట్టుగానే విజయమ్మ-షర్మిల నిర్వహించిన సభకు హాజరయ్యారు. వైఎస్‌ఆర్ శిష్యుడిగా చెప్పుకోడానికి తాను గర్వపడుతున్నానని ఘనంగా చాటొచ్చి.. కాంగ్రెస్‌లో మరోసారి రచ్చ రాజేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
వైఎస్ సంస్మరణ సభకు వద్దన్నా వెళ్లడం ముమ్మాటికీ క్రమశిక్షణారాహిత్యమని మండిపడుతున్నారు పీసీసీ సభ్యులు. ఓపిక పడుతున్నా కొద్దీ.. కోమటిరెడ్డి మరింత ఓవర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఎడ్డం అంటే.. కోమటిరెడ్డి తెడ్డం అంటున్నారని.. పార్టీ లైన్‌ను కావాలనే కాలరాస్తున్నారని అంటున్నారు. కీలక నేత కాబట్టి.. ఇప్పటికే చాలాసార్లు ఉపేక్షించామని.. అయినా కోమటిరెడ్డి తీరు మారటం లేదని.. ఇలాగైతే యాక్షన్ తీసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
కోమటిరెడ్డి తీరు ఇటీవల కాలంలో బాగా వివాదాస్పదమవుతోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచీ కోమటిరెడ్డి కావాలనే మరింత ఓవర్ చేస్తున్నారని అంటున్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి రాలేదనే అక్కసుతో.. రేవంత్‌రెడ్డి ఆ పదవి డబ్బులిచ్చి కొనుక్కున్నారంటూ గతంలో తీవ్ర కలకలం రేపారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట ఏరియాలో రేవంత్‌రెడ్డి దళిత-గిరిజన దండోరా పెడతానంటే.. తాను అందుబాటులో ఉండనంటూ ఆ సభ పెట్టకుండా సహాయ నిరాకరణ చేశారు. ఇప్పుడు పీసీసీ వద్దని చెప్పినా.. వైఎస్సార్ సంస్మరణ సభకు హాజరై పార్టీపై ధిక్కార ధోరణ ప్రదర్శించారు. పైగా వెళితే తప్పేంటని ప్రశ్నించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే అంటున్నారు. శిశుపాలుడిలా వంద తప్పుల వరకూ ఉపేక్షించే పరిస్థితి లేదని చెబుతున్నారు. గతంలో కోమటిరెడ్డి పార్టీకి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని.. ఆయనకు ఇప్పటికీ గౌరవిస్తున్నామని.. మరీ ఇంతలా ఓవరాక్షన్ చేస్తే వేటు పడక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు.