లోటస్ పాండ్‌లో పీకే మీటింగ్స్.. రేవంత్ రెడ్డే టార్గెటా?
posted on Jul 7, 2021 9:01AM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు జరుగుతున్నాయి. రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను తొలగించడంతో మొదలైన రాజకీయ కాక.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో మరింత రంజుగా మారింది. బీజేపీకి జై కొట్టిన రాజేందర్.. హుజురాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అటు అధికార పార్టీ నేతలు బైపోల్ కోసం భారీ వ్యూహాలే రచిస్తున్నారు. కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి రాకతో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక పరిణామం జరిగింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడానికి కొన్ని గంటల ముందు... దేశంలోనే టాప్ పొలిటికల్ అనలిస్టుగా పేరున్న ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ రావడం ఆసక్తి రేపుతోంది.
తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల నూతన పార్టీని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి జూలై 8వ తేదీన అధికారికంగా పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించనుంది. షర్మిల పార్టీకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసేది లేదని ప్రకటించారు. తాజాగా పీకే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో దర్శనమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగన్‌కు గత ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేసిన సమయంలో ‘పీకే’ టీమ్ కు కార్యాలయాన్ని కేటాయించారు జగన్. అప్పటి నుంచి ఆ భవనంలోనే ‘పీకే’ కార్యాలయం కొనసాగుతోంది. అక్కడే తన టీమ్‌తో ప్రశాంత్ కిశోర్ రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ ఆవిర్భావానికి రెండు రోజుల ముందు ప్రశాంత్ కిశోర్ రావడం పెద్ద చర్చగా మారింది. గతంలో జగన్ కోసం పనిచేసిన ఆయన ఇప్పుడు చెల్లి కోసం తిరిగి లోటస్ పాండ్ కు వచ్చారా.. గత ఎన్నికల్లో జగన్ కు వ్యూహరచన చేసినట్లుగానే ఇప్పుడు షర్మిల భవిష్యత్ రాజకీయాలపై కూడా ఇక్కడి నుంచే ప్రణాళికలు జరగనున్నాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
ఇటీవల విజయమ్మ సైతం పలువురు నేతలతో షర్మిల పార్టీకి ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వస్తున్నట్లు చెప్పారని తెలుస్తోంది.
పీకే టార్గెట్ రేవంత్ రెడ్డేనా?
ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియ ఇటీవల షర్మిలను లోటస్ పాండ్ లో కలిశారు. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసేందుకు వచ్చినట్లు వార్తలొచ్చాయి. ‘పీకే’ వ్యూహకర్తగా పనిచేసేది లేదని ప్రకటించిన నేపథ్యంలో తనకు బదులుగా తన శిష్యురాలు ప్రియను పంపించినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరిగాయి. షర్మిలను ప్రియ కలిసిన కొద్ది రోజుల అనంతరం ప్రశాంత్ కిశోర్ లోటస్ పాండ్ కు చేరుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే షర్మిల లేని సమయంలో ‘ప్రశాంత్ కిశోర్’ తన ‘ఏపీఏసీ’ కార్యాలయానికి రావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత రహస్యంగా జరిగిన సమావేశంలో షర్మిల రాజకీయ భవిష్యత్ పైనే చర్చలు జరిగాయా? లేదా మరే ఇతర అంశపైన జరిగిందా అనేది తెలియడం లేదు.
మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే వ్యూహకర్తగా పనిచేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు శరద్ పవార్ తో పలు సార్లు సమావేశమయ్యారు పీకే. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టేందుకే పీకే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఆశిస్సులతోనే రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు దక్కాయి. ఈ లెక్కన రేవంత్ రెడ్డి టార్గెట్ గా పీకే పని చేయకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి పీకే హైదరాబాద్ రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.