కేటీఆర్ కొడుకు పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన హిమాన్షు..
posted on Jul 6, 2021 @ 10:03PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ తనయుడు కేటీఆర్. ప్రస్తుత మంత్రి. కాబోయే ముఖ్యమంత్రి. ఇప్పుడంతా వారసత్వ రాజకీయాలే. తండ్రి పోతే కొడుకు.. కొడుకు పోతే మనవడు.. ఇలా సాగుతున్నాయి పాలిటిక్స్. ఇంకా కేటీఆరే సీఎం కాలేదు.. అప్పుడే కేటీఆర్ కుమారుడు హిమాన్షు పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాత అడుగుజాడల్లో నడుస్తూ.. తాతకు తగ్గ తనయుడు అనిపించుకుంటున్న.. హిమాన్షు రాజకీయాల్లోకి వచ్చేది ఎప్పుడంటూ అప్పుడప్పుడు కేటీఆర్‌నే ట్విట్టర్‌లో ప్రశ్నిస్తుంటారు నెటిజన్లు.
ప్రస్తుతం హిమాన్షు ఇంకా స్కూల్ స్టేజ్‌లోనే ఉన్నారు. చదువుల్లోనూ బానే రాణిస్తున్నట్టున్నారు. ఇటీవల ఆయనకు అంతర్జాతీయ డయానా అవార్డు కూడా వచ్చింది. హిమాన్షు చదువు పూర్తవడానికి ఇంకా చాలా ఏళ్లే పడుతుంది. అయినా.. ఎంత చదువుకున్నా.. మళ్లీ తిరిగి రావాలసింది రాజకీయాల్లోనే కదా అనే మాటలూ వినిపిస్తుంటాయి. అందుకే, తన పొలిటికల్ ఎంట్రీపై స్వయంగా కేటీఆర్ తనయుడు హిమాన్షునే క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా, ఆయన చేసిన ట్వీట్‌లో పక్కాగా తేల్చి చెప్పేశారు.
మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మంగళవారం హిమాన్షు ట్విటర్‌లో ఓ మెసేజ్ చేశారు. హిమాన్షు చేసిన ఓ ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే...
తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు హిమాన్షు. తనకు రాజకీయాలు ఏ మాత్రం ఆసక్తి లేదని.. ఎప్పటికీ పాలిటిక్స్‌లోకి రానని చాలా క్లియర్‌గా చెప్పారు. తన లక్ష్యాలు.. సాధించాల్సిన గోల్స్ వేరే ఉన్నాయని ట్వీట్ చేశారు. హిమాన్షు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. ఉద్యమ సమయంలో కేసీఆర్ సైతం ఇలానే చెప్పారని.. తన పిల్లలెవరూ రాజకీయాల్లోకి రారని అన్నారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత ఏమంది? కేసీఆర్ కూతురు కవిత సైతం రాజకీయాల్లో జొరబడే. కేటీఆర్ సైతం అంతే. ఉద్యోగం కంటే రాజకీయమే బాగుందనుకున్నారో ఏమో.. అమెరికాలో జాబ్ క్విట్ చేసి మరీ.. తెలంగాణలో వాలిపోయారు. రానన్న వారే ఇప్పుడు రాజ్యమేలుతుండే. అందుకే, ఇప్పటికి పిల్లాడే అయిన హిమాన్షు మాటలు అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. పెద్దయ్యాక తెలుస్తుంది.. ఉద్యోగం కంటే రాజకీయం ఎంతబాగా గిట్టుబాటు అవుతుందోనని. ఆ తర్వాత పార్టీ డిమాండ్ మేరకు.. తెలంగాణ అవసరాల మేరకు.. హిమాన్షు అభిప్రాయం మార్చుకొని.. రాజకీయ అరంగేట్రం చేసినా చేయొచ్చు.. ఏమో.. ఎవరికి తెలుసు.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు...