కేజ్రీ విజయం వెనుక పీకే వ్యూహం... తెర వెనుక కథ నడిపింది అతనే....

దేశమంతా గెలిచినా... ఢిల్లీలో మాత్రం మీ పప్పులుడకవని కమల దళాన్ని శాసించిన ఒకే ఒక్కడు కేజ్రీవాల్. అయితే ఈసారి విజయం అంత సులభంగా రాలేదు. కేజ్రీవాల్ విజయం వెనుక కనబడని ప్రశాంత్ కిషోర్ హస్తముంది. నిజానికి, పీకే అంటే ఒకప్పుడు కేజ్రీవాల్ కి వ్యతిరేక భావన ఉండేది. కానీ, ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ.. బీజేపీ తన వ్యూహాలకు పదునుపెట్టడంతో... కేజ్రీవాల్ కూడా అనివార్యంగా తన వ్యూహాలను మార్చాల్సి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాల్సి వచ్చింది. 

ప్రశాంత్ రంగంలోకి దిగడంతో కాంపెయినింగ్ పద్ధతే మారిపోయింది. చివరకు విజువల్ పబ్లిసిటీ విషయంలోనూ ప్రశాంత్ కిషోర్ జిమ్మిక్కులు చేశారు. ఆప్ పార్టీ పోస్టర్లను సమూలంగా మార్చేశారు. మొన్నటివరకూ వైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న పోస్టర్లను.... పూర్తి బ్లాక్ కలర్ లో డిజైన్ చేశారాయన.. దీనివల్ల పోస్టర్లు, ఫ్లెక్సీలు చాలా అట్రాక్టివ్ గా రూపొందాయి. కలర్ సైకాలజీలో దిట్టయిన పీకే... ఇప్పటికే బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ప్రజల సెంటిమెంట్ ఆధారంగా కలర్స్ ను ఉపయోగించుకుని ఆయా నేతలకు విజయాలను కట్టబెట్టారు. అదే స్టైల్లో ఢిల్లీలోనూ ప్రయోగం చేశారు. ఇక, నాయకుల ముఖమే అతిపెద్ద ప్రచారమని పీకే నమ్ముతారు. అందుకే ఆప్ లీడర్ ఇమేజ్ చుట్టూనే ప్రచారమూ సాగింది. అందుకే, కేజ్రీవాల్ పోస్టర్స్ ను విభిన్నంగా రూపొందించారు పీకే.

ఇక, లగే రహో కేజ్రీవాల్.... ఇది ప్రభుత్వ వ్యతిరేకతను జయించే మంత్రం... ఈ నినాదం కేజ్రీవాల్ కు బాగా కలిసొచ్చింది. జాతీయ నేతగా అరవింద్ కు గుర్తింపు తగ్గిన నేపధ్యంలో ప్రశాంత్ కిషోర్ రచించిన ఈ గెలుపు నినాదం కేజ్రీని మరోసారి సరికొత్త నేతగా పరిచయం చేసింది. ఈ గెలుపుతో ఇప్పుడు కేజ్రీ మరోసారి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. ఇక, పీకే వ్యూహంలో చివరాఖరిది.. పోస్టర్ మీద లగే రహో కేజ్రీవాల్ కేప్షన్... ఈ ట్యాగ్ లైన్ ను పసుపు పచ్చని రంగులో ముద్రించారు. ఇది హిందూవాదుల మనోభావాల్ని గౌరవించడమే కాదు.. ఆప్ హిందువుల పార్టీ కూడా అని చాటి చెప్పారు. దాంతో ఆప్ పై ఉన్న హిందూ వ్యతిరేక భావజాలం కూడా కొట్టుకుపోయింది. అంతేకాదు.. జాతీయ అంశాలు తక్కువగా, ఢిల్లీ అంశాలను ఎక్కువగా ప్రచారంలో చోటు కల్పించాలని పీకే సూచించారు. ఇలా, పోస్టర్ నుంచి ప్రసంగం వరకు.... మేనరిజమ్స్ నుంచి మేకోవర్ వరకు ప్రశాంత్ కిశోర్ చేసిన జిమ్మిక్కులు వర్కవుట్ అయ్యాయని... కేజ్రీవాల్ గుడ్ గవర్నెన్స్ ను తోడు.... ఇవి కూడా కలిసొచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.

Teluguone gnews banner