ప్రకాశం కాంగ్రెస్ ఎంఎల్ఏ ల చూపు జగన్ వైపు ?
posted on Jan 4, 2013 @ 12:04PM
ప్రకాశం జిల్లాలోని అనేక మంది కాంగ్రెస్ శాసనసభ్యులు జగన్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే, తాము గెలవడం కష్టమని వారు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి, జగన్ పార్టీ వైపు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ, తమకు 2014 లో టికెట్ ఇచ్చేటట్లయితే, పార్టీ మారడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాయబారాలు చేస్తున్నట్లు సమాచారం.
జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎంఎల్ఏ లు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అయి ఉన్నారు. వారిలో దర్శి ఎంఎల్ఏ శివ ప్రసాద రెడ్డి, అడ్డంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవి కుమార్ లకు ఆ పార్టీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆయా నేతల శక్తి సామర్ధ్యాలు, వారి నియోజక వర్గాల్లో వారికున్న ప్రజాదరణ వంటి అంశాలను ప్రస్తుతం జగన్ పార్టీలోని సీనియర్ నేతలు అంచనా వేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారందరినీ చేర్చుకోకూడదని వారు భావిస్తున్నారు.
జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ ఎంఎల్ఏ లు మరో ఆలోచన లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తమ దృష్టి మళ్ళించారు. జిల్లాకు చెందిన అనేక మంది కాంగ్రెస్ ఎంఎల్ఏ లు తమ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపించారని బాలినేని ప్రకటించారు కూడా. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం జగన్ మోహన్ రెడ్డిదే నని ఆయన అన్నారు.
జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం లోపించడం కూడా ఈ పరిణామాలకు కారణంగా తెలుస్తోంది.