పాపం... పొన్నం..! తలకిందులైన పరిస్థితి..!

పొన్నం ప్రభాకర్... ప్రస్తుతం తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్... చాలా కిందిస్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం, ఎంపీగా గెలిచిన తరువాత ఢిల్లీ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకమైన లీడర్‌గా చలామణి అయ్యారు. ఎంపీ ఫోరమ్ కన్వీనర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు కూడా ఉండటంతో పొన్నం ప్రభాకర్‌కు, పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ హవా నడిపించారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాతే, పొన్నం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. 

తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెడుతుంటే, లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్పేని అడ్డుకున్నారు పొన్నం. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. అయినా, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి ఇప్పటివరకు మళ్లీ కోలుకోలేదు పొన్నం. ప్రతీ ఎన్నికల్లో ఆయనకు ఎదురుదెబ్బలే తగులుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారున్ని అంటూ పొన్నం మొత్తుకుంటున్నా, ప్రజలు మాత్రం ఆదరించడం లేదు. ఇటు క్యాడర్‌లో మనోస్దైర్యం నింపడంలోను, పొన్నం విఫలమవుతున్నారని అంటున్నారు.

ఎన్‌ఎస్‌యూఐ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగిన పొన్నం... ఇప్పుడు పూర్తిగా డీలా పడిపోయారు. సొంత జిల్లాలో కాంగ్రెస్‌ను బతికించుకోలేకపోతున్నారు. ఇటీవల వచ్చిన వరుస ఎన్నికల ఫలితాలు చూస్తే, ఆ విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్, మూడో స్థానంలో నిలిచారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లోను పోటీ చేసినా థర్డ్‌ ప్లేసే మిగిలింది. ఇక, మున్సిపల్ ఎన్నికల్లోనూ కరీంనగర్ జిల్లాలో అన్నీ తానై నడిపించారు పొన్నం. తాను అనుకున్నవారికే పొన్నం టికెట్లు ఇచ్చారు. అయినా కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీల్లో, ఎక్కడా కాంగ్రెస్‌కి, అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయారు. ఇక కరీంనగర్ నగర పాలక ఎన్నికల్లో అయితే, పార్టీ ప్రకటించిన మేయర్ అభ్యర్థితో సహా చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో, పొన్నం మీడియా ముందుకే రావడం మానేశారు. మరి పొన్నం సక్సెస్‌ ట్రాక్‌ ఎప్పుడు పడతారో, మళ్లీ తన హవాను ఎప్పుడు నడిపిస్తారో, కాలమే సమాధానం చెప్పాలి.

Teluguone gnews banner