కప్పలకు తీసిపోని రాజకీయ నేతలు
posted on Mar 11, 2014 @ 3:10PM
భూమి గుండ్రంగా ఉన్నట్లుగానే తాము మళ్ళీ తెదేపాలోకే వచ్చిపడ్డామని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆనంద బాష్పాలు రాలుస్తూ చెప్పిన మాటలు అక్షరాల నిజమే. అయితే భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణం చేయడానికి ఒకరోజు పడితే, ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీల చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తవడానికి ఐదేళ్ళు అంటే ఎన్నికల నుండి మళ్ళీ ఎన్నికల వరకు సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ ఐదేళ్ళు పూర్తయి ఎన్నికలు వచ్చేసాయి గనుక అనేకమంది నేతలు స్వంత గూళ్ళు వెతుకొంటూ తిరుగుతున్నారు. అయితే పార్టీ సిద్దాంతాలకు, ఆశయాలకు అతీతులయిన చాలా మంది నేతలు మాత్రం అన్ని పార్టీలను తమ స్వంత పార్టీలుగానే భావిస్తూ ఎందులో బెర్తు కన్ఫర్మ్ అయిపోతే అందులో ఎక్కేసి సెటిల్ అయిపోతుండటంతో, అక్కడ ఆల్రెడీ చాలా కాలంగా రుమాళ్ళు, దుప్పట్లు వేసుకొనున్న వాళ్ళు అలిగి వేరే గూట్లోకి జంపైపోతున్నారు. వాళ్ళ రాకతో మళ్ళీ ఆ పార్టీలో కూడా అదే సీను రిపీటవుతోంది. అంటే నేతలందరూ ఉన్న ఈ నాలుగు పార్టీల మధ్య పరుగులు తీస్తూ నాలుగు స్తంభాలాట లేదా మ్యూజికల్ చేయిర్స్ ఆట ఆడుకొంటున్నారని అర్ధమవుతోంది. వారి జంపింగ్స్ అన్నీ పూర్తిగా కవర్ చేయాలంటే ఈ మూడు నెలలు ప్రత్యేకంగా కాలమ్స్ కానీ వీలయితే ప్రత్యేక పత్రికలూ గానీ పెట్టుకోక తప్పదు.
ఇప్పుడు అసలు కధలోకి వస్తే, తెదేపాలోకి టీజీ వెంకటేష్ వచ్చిపడగలిగినందుకు ఆనంద బాష్పాలు రాలిస్తే, కర్నూల్ టికెట్ కోసం ఆశపెట్టుకొన్న రాంభూపాల్ చౌదరి తనకు చంద్రబాబు హ్యాండిచ్చారని కన్నీళ్లు కార్చారుట. అదేవిధంగా అనంతపురం ఎమ్.పి వెంకట్రామిరెడ్డిని వైకాపాలోకి వచ్చిపడటంతో, అదే ప్రాంతానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే. గురునాధరెడ్డి హార్ట్ అయిపోయి దేనిలోకో దానిలోకి వెంటనే జంపైపోయేందుకు డిసైడ్ అయిపోయినట్లు తాజా వార్త. ఆయన దేనిలోకి జంప్ చేస్తే అక్కడి నేత కూడా ఆయన లాగే హర్టయ్యిపోయి, మళ్ళీ వేరే పార్టీలోకి జంపైపోవడం ఖాయం. గనుక ఈ భాగోతాలు సైకిల్ చక్రంలా తిరుగుతూనే ఉంటాయి.
తాజా సమాచారం ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట తెదేపా ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి తెరాసలోకి జంపయ్యారు. తెలంగాణ జెఎసి కో ఛైర్మన్ గా ఉన్న శ్రీనివాసగౌడ్ కి కేసీఆర్ మహబూబ్ నగర్ నియోజకవర్గం టికెట్ కన్ఫర్మ్ చేసేయడంతో ఆ నియోజక వర్గం ఇన్ చార్జీగా ఉన్న ఇబ్రహిం బాగా అప్ సెట్టయిపోయినట్లు తాజా సమాచారం.
ఇక కిరణ్ కొత్తపార్టీ ఇంకా రాజమండ్రీలో మొదటి సభ పెట్టుకొని పార్టీ గురించి, అందులో జనాల గురించి చెప్పుకోక మునుపే, దానికీ అప్పుడే బోణీ అయిపోయింది. నిన్నటి దాక ఆయనకు హ్యాండ్ పట్టుకొని తిరిగిన రాజమండ్రి నగర శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు, ఆయనకు హ్యాండిచ్చేసి వైకాపాలో చేరిపోయారు.
ఇక తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ మీద మనసు పారేసుకొన్నారని తెలియగానే, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు అలర్టయిపోయి, ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని అప్పుడే రోడ్డెక్కినట్లు లేటెస్ట్ అప్ డేట్స్ ఉన్నాయి. మరికొద్ది సేపటి లో దిగ్విజయ్ సింగ్ ఆంద్ర, తెలంగాణాలకు పీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించగానే బహుశః ఈ లిస్టులో మరిన్ని కొత్త పేర్లు వ్రాసుకోవలసి ఉంటుందేమో!