ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
posted on Nov 11, 2024 @ 3:29PM
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలి సారిగా ఓ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ అధికారులకు మాత్రమే నోటీసులు జారీ చేసిన పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు అధికారులను మాత్రమే విచారించిన కేసు దర్యాప్తు బృందం.. తాజాగా ఓ రాజకీయ నేతకు నోటీసులు జారీ చేసింది. నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు సోమవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించి విచారణ జరపాలన్న పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయనకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడంతో ఇప్పటిలో ఆయనను తెలంగాణకు రప్పించి విచారణ జరిపే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.