పీఎం మోదీ వెయిటింగ్ ఇక్కడ.. సీఎం మమత ఎక్కడ..?
posted on May 28, 2021 @ 7:17PM
సీఎం మమత కోసం పీఎం మోదీ వెయిటింగ్. నిమిషమో, రెండు నిమిషాలో కాదు. ఏకంగా అరగంట నిరీక్షణ. ఇక ఆమె రాదనుకుంటుండగా.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు మమతా బెనర్జీ. కాసేపు అలా కూర్చొని.. ఆ వెంటనే వెళ్లిపోయారు. పీఎం అయితేనేం..? మోదీ అయితేనేం..? మమతా.. సీఎం మమత ఇక్కడ.. అంటూ ఫైర్ బ్రాండ్ లీడర్ తనను మొండిఘటం అని ఎందుకు అంటారో మోదీకి తెలిసొచ్చేలా చేశారు. బెంగాల్ దంగల్‌పై ఓ మోస్తారు రివేంజ్ తీర్చుకున్నారు.
బీజేపీ, తృణమూల్ మధ్య పార్టీ పరంగా ఎంతగా విభేదాలు ఉన్నా.. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ఆ భేదాభిప్రాయాలు చూపించేవాళ్లు కాదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో హుందాగా వ్యవహరించేవాళ్లు ఆ ఇద్దరు. కానీ, ఇదంతా గతం. ఇప్పుడు నువ్వా-నేనా అన్నట్టు తలబడుతున్నారు. తాను గెలిచాక మోదీ ఫోన్ చేసి.. విషెష్ చెప్పలేదని ఇప్పటికే దీదీ.. మోదీపై అలిగారు కూడా. తాజాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి మోదీ నిర్వహించే మీటింగ్‌కు డుమ్మా కొట్టాలని చూశారు. ఆఖరి క్షణం వరకూ వెళ్లకుండా.. మోదీని వెయిట్ చేయించి.. చివరాఖరికి ఇలా వెళ్లి అలా వచ్చేయడం కలకలంగా మారింది.
యాస్ తుపాను విషయంపై ప్రధాని మోదీ నిర్వహించే సమీక్షా సమావేశానికి తాను హాజరు కానని, సీఎస్ హాజరవుతారని మొదట సీఎం మమత బెట్టు చేశారు. ప్రధాని మోదీ, గవర్నర్ ధన్కర్ ఆమె కోసం అరగంట పాటు వేచి చూశారు. ఇక మమత రాదనుకొని.. సమీక్షా సమావేశాన్ని ప్రారంభించారు. హఠాత్తుగా, 30 నిమిషాల ఆలస్యంగా.. సీఎం మమత సమావేశానికి హాజరయ్యారు. అయితే ఎక్కువ సేపు సమావేశంలో ఉండలేదు. తుపానుకు సంబంధించిన కొన్ని పత్రాలను మోదీకి సమర్పించి, అక్కడి నుంచి సీఎం మమత నిష్క్రమించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధానిని అంతసేపు వెయిట్ చేయించడం.. పద్దతి కాదని.. ఇది ప్రోటోకాల్‌కు విరుద్ధమని.. పీఎంవో వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయినా.. మొండిఘటం మమత పట్టించుకుంటేగా....