సొంతింటి కోసం స్కెచ్ ఇలా!!
posted on Jul 29, 2024 @ 9:30AM
ప్రతి ఒక్కరికి సొంతం ఇల్లు అనేది ఒక కలలాగా ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి జీవితకాలం కష్టడేవాళ్ళు చాలామంది ఉంటారు. వెనుక తరాల ఆస్తిపాస్తులు, పెద్ద పెద్ద సంపాదన ఏమాత్రం లేనివాళ్లకు అయితే సొంతిల్లు అనేది అందని ద్రాక్షలాగా ఉంటుంది. ఏళ్లకేళ్ళు అద్దె ఇళ్లలో బ్రతికేస్తూ అసంతృప్తిని భరిస్తున్నవాళ్ళు ఎంతోమంది ఉందనే ఉంటారు. నిజానికి పేద, బడుగు వర్గాల వారికి ప్రభుత్వాలు భూములు మంజూరు చేసినా, ఇళ్ల నిర్మాణం కోసం లోన్లు ఇచ్చినా అవన్ని కూడా అందుకుంటున్న జనాభా శాతం చాలా తక్కువ. అందువల్ల సొంతింటి కల మీద ఆశలు వదిలేసుకుంటూ కొందరు, మనసులో బాధపడుతూ మరికొందరూ అసంతృప్తిగా బ్రతికేస్తున్నారు.కాసింత మెరుగైన సంపాదన ఉంటే సొంతం ఇల్లు అనేది పెద్ద ఘనకార్యం కాదని, అందులోనూ పట్టణాల్లో ఇలాంటి కల తీర్చుకోవడం కష్టమని అసలు అనిపించదు. కావాల్సిందల్లా కాస్త ప్రణాళిక మాత్రమే.
పొదుపు సూత్రంలో ప్రణాళిక!!
కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి అనేది అందరికీ తెలిసిన విషయమే!! అయితే ప్రతి నెలా సంపాదన, పొదుపుగా ఇల్లు ఎలా నెట్టుకురావచ్చు?? ఖర్చులు, మిగులు ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుని, అనవసరమైన ఖర్చుల వెంట వెళ్లకపోతే పొదుపు కూడా బాగానే చేయచ్చు.
పెళ్లి తరువాత??
చాలామందికి పెళ్లి తరువాత చిన్నగా బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. రెండు చేతుల సంపాదన ఉంటే పర్లేదు కానీ ఒక్కరి సంపాదనతో నగరాల్లో నెట్టుకురావడం కష్టమే. ఇద్దరి సంపాదన ఉన్నవాళ్లు అయితే చక్కగా లోన్ తీసుకుని ప్లాట్ కొనేసి సెటిల్ అయిపోతారు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వస్తుంది. అదే పిల్లల బాధ్యత. పెళ్లయ్యాక చాలామంది మొదట సెటిల్ అయ్యాక పిల్లలు అనేది ఇందుకే. పిల్లలు పుట్టుకొచ్చాక వాళ్ళ ఖర్చులు, ఆ తరువాత చదువులు, ఫీజ్ లు ఇలా చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు ఇంటికి పునాది వేసినట్టు ఇంటి కలకు కూడా పెళ్లికి ముందే ఓ ప్రణాళిక వేయడం ఉత్తమం.
బ్యాంక్ లతో భళా!!
ఇప్పట్లో చాలావరకు బ్యాంక్ లు లోన్లు ఇచ్చేస్తున్నాయి. వాళ్లకు కావాల్సిందల్లా ఉద్యోగం సరిగ్గా ఉందా?? లేదా?? నెలసరి ఆదాయం పెట్టుకున్న లోన్ కు తగ్గట్టు కట్టేలా ఉందా లేదా అన్నది మాత్రమే. ఇలా లోన్ తీసుకోవడం నుండి నెలవారీ చెల్లింపులు సక్రమంగా కట్టేస్తూ ఉంటే ఎలాంటి సమస్యా ఈ లోన్ల వల్ల రాదు. చాలామందికి లోన్ అప్లై చేసుకోవడం ఇల్లు కొనుక్కోవడం తెలుస్తూనే ఉంటుంది కానీ నెలసరి చెల్లింపులు సక్రమంగా కట్టకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అభిరుచితో కొత్తగా!!
చాలమందికి ఉద్యోగ వేతనం సరిపడినంత ఉండదు. అయినా వాళ్ళు అందులో కొనసాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రస్తుత కాలంలో కేవలం ఆ ఉద్యోగంతో సంపాదిస్తూనే తృప్తిపడిపోయి ఆగిపోకుండా అభిరుచిని బట్టి పార్ట్ టైమ్ లేదా స్వీయ అభిరుచితో తమదైన సంపాదనను ఎలాంటి సమస్య లేకుండా చేతుల్లో అందుకోవచ్చు. కేవలం రెండు లేదా మూడు గంటల పనితో సుమారు పదివేల రూపాయల వరకు స్అంపడించే అవకాశాలు బోలెడు ఉంటున్నాయి. ఇవి మాత్రమే కాకుండా స్వంతంగా ఉద్యోగం లేని సమయాల్లో తమలో ఉన్న నైపుణ్యంతో వ్యాపారాలు చేస్తూ షేర్ మార్కెట్ మీద అవగాహనతో పెట్టుబడులు పెడుతూ కూడా గొప్పగా సంపాదించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మార్గాలు అనుసరిస్తే ఎవరితో ఉన్న అభిరుచే వారికి బోలెడు అవకాశాలు తెచ్చిపెడుతుంది.
మీ నిర్ణయం మీ చేతుల్లో!!
చాలామంది ఇల్లు, స్థలం వంటివి కొనుగోలు చేయాలి అంటే ఎంతో మంది అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రాంతాన్ని బట్టి ఉండే ధరల విషయంలో ఈ అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిదే అయితే ఇల్లు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయం మాత్రం వేరే ఎవరి చేతుల్లో పెట్టకూడదు. ఈ కాలంలో అయితే అపార్ట్మెంట్లు ఎంతో సులువుగానే లభిస్తున్నాయి కూడా. ముఖ్యంగా కాసింత ఓపిక ఉంటే యూట్యూబ్ లాంటి చోట్ల ఉన్న ఆసక్తిని అప్లోడ్ చేస్తూ కూడా బోలెడు సంపాదించవచ్చు.
కాబట్టి ఇన్ని విధాలుగా ఆలోచిస్తే ఇన్ని ఆలోచనల్ని ఒక ప్రణాళికలో చేరిస్తే సొంతిల్లు నిజం కానిదేమీ కాదు.
◆ వెంకటేష్ పువ్వాడ