టీడీపీ కూటమికే జైకొట్టిన పయనీర్ ఎగ్జిట్ పోల్
posted on Jun 1, 2024 @ 7:05PM
ఏపీలో ఎవరు గెలవబోతున్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతోందా? మరో సారి వైసీపీ అధికార పీఠాన్ని దక్కించుకోబోతుందా? ఒకవేళ తెలుగుదేశం కూటమి గెలిస్తే ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లు వైసీపీకి ఘోర పరాభవం తప్పదా? రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరి మదిలో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం దొరకాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే. అయితే, ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని కాస్త ముందుగానే అంచనా వేయడానికి తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను దోహదం చేస్తాయి.
ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. తాజాగా ప్రముఖ సంస్థ పయనీర్ ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అధకారం తెలుగుదేశం కూటమిదేనని విస్పష్టంగా తేల్చేసింది. ఆ సంస్థ ఎన్నికల ముందు చేసిన సర్వేలో కూటమిదే అధికారం అని పేర్కొంది. ఎన్నికల తరువాత నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో కూటమిదే అధికారం అని తేలినట్లు పేర్కొంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 144 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందభి మోగించబోతున్నారని పయనీర్ సంస్థ పేర్కొంది.
ఇక అధికార వైసీపీ కేవలం 31 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతుందని తేల్చింది. ఓటింగ్ శాతం విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం కూటమి 52శాతం, వైసీపీ 41శాతం, కాంగ్రెస్ 4శాతం, ఇతరులు మూడు శాతం ఓట్లు దక్కించున్నట్లు పయనీర్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. ఇక లోక్‌సభ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో వైసీపీ అభ్యర్థులు 22 నియోజకవర్గాల్లో విజయం సాధించారు.
అయితే, ప్రస్తుతం ఎన్నికల్లో వైసీపీకి లోక్ సభ ఎన్నికలలోనూ ఘోర పరాభవం ఎదురుకాబోతుందని పయనీర్ సర్వే సంస్థ పేర్కొంది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం కూటమి అభ్యర్థులు 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.