ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కల్యాణ్ ఫొటోలపై పిటిషన్
posted on Sep 10, 2025 @ 10:07AM
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టడంపై ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రైల్వేలో పని చేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఫొటోల ప్రదర్శనపై ఒక స్పష్టమైన విధానం రూపొందించాలని పేర్కొన్న ఆయన..
ఆ విధానం రూపొందే వరకూ ఉప ముఖ్యమంత్రి ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయనా పిటిషన్ లో కోరారు. కోర్టు ఆయన పిటిషన్ ను బుధవారం (సెప్టెంబర్ 10) విచారించే అవకాశం ఉంది.
వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది లేదు. పవన్ కళ్యాణ్ కూడా తాను కేబినెట్ మంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ కు ప్రత్యేక హోదా, గౌరవం ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో పాటు ఆయన ఫొటో కూడా ఉంచుతోంది.
అయితే ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోలు మాత్రమే ఉండాలనీ.. ఉప ముఖ్యమంత్రి ఫొటోను ఉంచడానికి వీల్లేదనీ పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.