జగన్ ప్రయత్నాలకు సుప్రీంలో బ్రేక్ పడనుందా?
posted on Apr 25, 2020 @ 4:48PM
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోగానే మధ్యలోనే ఆగిపోయిన స్ధానిక ఎన్నికల పోరును తిరిగి ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేయబోతోందా అంటే తాజా పరిణామాలు అవుననేలా ఉన్నాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గకముందే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టులో నరేంద్రరెడ్డి అనే లాయర్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై రేపో మాపో విచారణ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో స్దానిక ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలను సైతం నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తన పిల్ లో కోరారు.
ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వాలు స్ధానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనూ ఎన్నికల కమిషనర్ ను మార్చి కొత్త కమిషనర్ ను నియమించిన ప్రభుత్వం.. స్ధానిక ఎన్నికలకు తమ పార్టీ నేతలను ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ కరోనా తర్వాత సాధారణ పరిస్ధితులు నెలకొనే వరకూ ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని నరేంద్రరెడ్డి అనే న్యాయవాది ఈ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. కరోనా తగ్గకుండా ఎక్కడా ఎలాంటి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాలు ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో అభ్యర్ధించారు. ఎన్నికలు వాయిదా వేయకపోతే ఓటర్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించినట్లేనని పిటిషనర్ తన పిల్ లో అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు.
సుప్రీంకోర్టులో దాఖలైన తాజా ప్రజా ప్రయోజన వాజ్యం ఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కరోనా ప్రభావం నేపథ్యంలో స్ధానిక ఎన్నికలను వాయిదా వేయడాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.... మరోసారి ఈ పిల్ తో ఏకీభవిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు. కరోనా ప్రభావం తగ్గగానే స్ధానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏపీలో ఎన్నికల కమిషనర్ తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా సన్నద్దవుతున్న తరుణంలో ఈ పిల్ పై సుప్రీంకోర్టు ఆదేశాలు కీలకంగా మారబోతున్నాయి.