స్వోత్కర్ష.. పరనింద.. పేర్నినానికి ఇదే పనా?
posted on May 27, 2024 @ 9:58AM
పేర్ని నాని.. వైసీపీలో అందరూ మాటలు ఆపేసిన వేళ పేర్ని నాని మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ సొంత నియోజకవర్గ ప్రజలకు మాంఛి వినోదం అందిస్తున్నారు. ఓటమి భయం కప్పిపుచ్చుకోవడానికి మాటలను కోటలు దాటిస్తున్నారు. బందరులో తన కుమారుడు విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి ఆయన దగ్గర సరైన గణాంకాలు లేవు కానీ మాచర్లలో మాత్రం పిన్నెల్లి విజయం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లి కంచుకోట అని చెబుతూ అందుకు ఉదాహరణలు చెబుతున్నారు. ఒక వైపు పిన్నెల్లి సోదరుల దౌర్జన్యం, దుర్మార్గాలను ప్రపంచం అంతా వీక్షిస్తున్న సమయంలో పేర్ని నాని పిన్నెల్లికి వత్తాసు పలుకుతూ, అసలు సినిమా జూన్ 4 తరువాత చూస్తారని బెదరిస్తున్నారు.
ఇప్పుడు కాదు.. 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే వైసీపీలో మేధో శూన్యత ఉందనీ, స్వోత్కర్ష, పర నిందే ఆ పార్టీ సిద్ధాంతమనీ అందరికీ అర్ధమైపోయింది. నిస్సిగ్గుగా తమ తప్పులను సమర్ధించుకోవడమే కాకుండా.. తమ వైఫల్యాలను కూడా విపక్షంపై నెట్టివేసి చప్పట్లు కొట్టే విద్యలో వైసీపీ ఆరితేరిపోయింది. ఇప్పుడు అదే ఆరితేరిన విద్యను కొత్తగా పేర్ని నాని మరోసారి మొదలెట్టేశారు.
ఈవీఎం ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నేల్లినే బాధితుడిగా అభివర్ణించడానికి పేర్ని నాని ఎక్కడా సంకోచించడం లేదు. మీడియా ముందుకు వచ్చి పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్రపన్నిందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కుట్రకు ఎన్నికల సంఘంన, పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ గగ్గోలు పెట్టేశారు.
ఇంత కాలం ఎవరి అండ చూసుకునైతే వైసీపీ నేతలూ, మూకలూ రెచ్చిపోయాయో అదే పోలీసులు పాపం వైసీపీ నేతలకు వ్యతిరేకంగా మారిపోయారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఓటమికి సాకులు వెతుక్కునే వారే ఇటువంటి బేల మాటలు మాట్లాడతారు. ఇంత బేలగా, ఇంత దిగజారి ఆరోపణలు గుప్పిస్తున్న పేర్ని నాని అదే నోటితో పిన్నెల్లి విజయం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. విజయం ఖాయం అయితే ఈవీఎం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, దాడులకు, దౌర్జన్యాలకు దిగి, ఓటర్లను ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాల్సి వచ్చింది అన్న దానికి మాత్రం పేర్ని సమాధానం చెప్పరు. అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమిటి? మేం చెబుతాం మీరు వినండి అన్నట్లుగా సాగింది పేర్ని ధోరణి.
ఇంతకీ పిన్నెల్లి హత్యకు తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేసిన పేర్ని మాటల సారాంశం.. జూన్ 4 వరకూ ఎదురు చూడటం ఎందుకు.. మేం ఓడిపోయాం.. మా ప్రాణాలకు భద్రత కల్పిస్తే చాలు అని వేడుకోవడంలాగే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పిన్నెల్లి కోర్టు షరతులను ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నరసరావు పేటలోనే ఉండాలి. కానీ ఆయన నరసరావు పేటలో ఉండటం లేదు. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి అజ్ణాతంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఎదురు ఆయన హత్యకు తెలుగుదేశం కుట్ర పన్నిందనీ, ఆ కుట్రకు పోలీసులు సహకరిస్తున్నారనీ ఆరోపణలు మొదలెట్టేసింది. అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వైసీపీ తీరు ఉందన్న మాట. పేర్ని నాని ఎంతగా గొంతు చించుకున్నా పిన్నెల్లి విధ్వంస, దౌర్జన్య కాండ గురించి తెలిసిన ఏ ఒక్కరూ పిన్నెల్లిని కానీ, ఆయనకు వత్తాసుగా గొంతుచించుకు గగ్గోలు పెడుతున్న పేర్ని నానిని కానీ ఇసుమంతైనా నమ్మడం లేదు. అజ్ణాతంలో ఉన్న పిన్నెల్లి కౌంటింగ్ రోజున మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఆదివారం పల్నాడులో జరిగిన దాడే నిదర్శనంగా నిలుస్తుంది.