వైసీపీకి జనం రాసిన మరణశాసనం?
posted on May 27, 2024 9:21AM
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ అనే సినిమాలో కొవ్వు ఎక్కువై తెలియలేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపైంది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది. అధికార మదం తలకెక్కి అర్ధం కావడం లేదు కానీ.. వైసీపీ ఓటమి ఖరారై చాలా కాలమైంది. నిజమే.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేది ఎవరో అధికారికంగా తేలడానికి ఇక ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తై ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఏమిటన్నది వైసీపీతో సహా అందరికీ పోలింగ్ రోజునే అవగతమైపోయింది.
అధికారమదం తలకెక్కి అర్ధం కాలేదు కానీ.. వైసీపీ ఓటమి కోసం జనం ఎప్పుడో తమ ఆయుధానికి పదును పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్ కు మరో చాన్స్ ఇచ్చేది లేదని డిసైడైపోయారు. తమ ఓటు భద్రంగా ఉందో లేదో అనుక్షణం వెరిఫై చేసుకుంటూ వచ్చారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా జనం నిశ్శబ్దంగా చేశారు. ఈ నిశ్శబ్దం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత వారిలో నివురుగప్పిన నిప్పులా ఉంది. గడప గడపకు నుంచి వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినా.. ఆ ఏముందిలే అనుకున్నారు. వైనాట్ 175 ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా వెనుక ప్రజలు వ్యతిరేకించినా, అవినీతికి అలవాటుపడ్డ కొందరు ఉన్నతాధికారులు, పోలీసుల సహకారంతో వారిణి భయపెట్టి పబ్బం గడిపేసుకోగలమని భావించారు.
అయితే అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరన్న సంకేతాలు ఏడాది ముందు నుంచే స్పష్టంగా కనిపించాయి. ఎన్నికలలో జగన్ రెడ్డి బొక్కబోర్లా పడడం ఘయమని ఎప్పుడో తేలిపోయింది. సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని వైసీపీ నేతలు పగటి కలలు కన్నారు. గాలిలో మేడలు కట్టుకున్నారు. ఆశల పల్లకిలో ఊరేగారు.
ప్రజలు సంక్షేమం అంటూ జగన్ సర్కార్ ఇచ్చిందేదో పుచ్చుకున్నారు. అయితే జగన్ కు మరో చాన్స్ ఇచ్చే ప్రశక్తే లేదన్న నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. విధ్వంసం తప్ప విజన్ లేని పాలకుడు ఇక వద్దే వద్దని నిర్ణయానికి వచ్చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఏమిటో అనుకున్నామనీ, జగన్ అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన ప్రారంభించిన తరువాత కానీ జగన్ రెడ్డి మాటలను కూడా రివర్స్ గానే అర్ధం చేసుకోవాలని అర్ధం కాలేదని వాపోయారు. అప్పులు చేయడం సంక్షేమం అంటూ చిల్లర విసరడం తప్ప జగన్ హయాంలో రాష్ట్రంలో వీసమొత్తు అభివృద్ధి జరగలేదు. చేసిన పనులకు కాంట్రాక్టర్లు బిల్లులు అందలేదు. దీంతో రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులకు టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లకే కాదు పార్టీ క్యాడర్ కు మేలు చేయడం కోసం అంటూ కేటాయించిన నామినేషన్ పనులకు కూడా పార్టీ క్యాడర్, నేతలు ముందుకు రావడం మానేశారు. అంటే పార్టీ క్యాడర్ లోనే జగన్ రెడ్డి విశ్వాస స్థాయి దిగజారింది.
అంతెందుకు ప్రభుత్వ భూములు ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాథుడే లేకుండా పోయారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్ వైజాగ్ లో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెడితే ప్రజల నుంచి స్పందన లేదు. వాస్తవానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది అన్న నమ్మకంతో జనం ముందుకు రావాలి. చంద్రబాబు హయాంలో అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. అదీ విశ్వాసం అంటే. కానీ జగన్ సర్కార్ కు ప్రజలలో విశ్వసనీయత లేదనడానికి జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ లు కొనడానికి ఎవరూ రాకపోవడమే నిదర్శనం అని అప్పుడే తేలిపోయింది. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలూ, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేమని చెప్పకనే చెప్పేశారు. అయినా వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఆ విశ్వాసంతో తమకే ఓటు వేస్తారని నమ్మింది. మే 13న పోలింగ్ సరళి చూసిన తరువాత కానీ వైసీపీ నేతలకు అర్ధం కాలేదు. వాస్తవం బోధపడలేదు. హింస, దౌర్జన్యం, దుర్మార్గాలతో జనాలను భయపెట్టి ఓట్లేయించుకోలేమని. ప్రజలు తమ పార్టీని తిరస్కరించారని. అందుకే వైసీపీలో ఇంత కాలం నోరెట్టుకు పడిపోయిన ఏ నాయకుడూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని చెప్పడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.