అధికారం తలకెక్కి జనాలను విస్మరిస్తే.. జరిగేదదే!
posted on May 25, 2024 @ 2:42PM
రాజకీయ నాయకులు అధికారం తలకెక్కి ప్రజలను విస్మరిస్తే.. ఎంతటి నాయకుడికైనా పరాభవం తప్పదు. ప్రతిష్ట మసకబారక తప్పదు. అధకారంలో ఉండగా తనను తాను కారణజన్ముడిగా మిలినిన మనుషులంతా మామూలు జీవులేనన్న భావన తలకెక్కి వారిని చులకనగా చూస్తే.. జనం తగిన బుద్ధి చెబుతారు. అధికారం నుంచి ఓటు అనే ఆయుధంతో కిందకి దించి వాళ్ల కళ్లు నేలమీదకు వచ్చేలా చేస్తారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎందరో నాయకులు ఎన్నికలలో పరాజయంతో తత్వం బోధపరుచుకున్నారు. కొందరికి తత్వం బోధపడదనుకోండి అది వేరే సంగతి. అలాంటి వారు ప్రజా జీవితానికి శాశ్వతంగా దూరం అవుతారు. అధికారంలో ఉండగా నా మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరించిన నేతలకు ప్రజాస్వామ్యం వారి స్థానం ఏమిటో తప్పకుండా చూపుతుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి2014లో రాష్ట్రం సాధించే వరకూ అవిశ్రాంతంగా రాజకీయ పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేసట్టి.. ఐదేళ్ల కాలంలో జగన్ అహంకారంతో వ్యవహరించిన తీరుపై ప్రజా తీర్పు ఏమిటన్నది మరో పది రోజుల్లో వెల్లడి కానున్నది. కేసీఆర్ విషయానికి వస్తే తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆయన రాష్ట్రంలో విపక్షం ఎందుకు నేనుండగా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రజలు తన పాలనలో సుభిక్షంగా ఉన్నారని ఆయనకు ఆయనే నిర్ణయించుకుని.. ఇంకా నిరసనలూ, ఆందోళనలేమిటని హుంకరించారు. ధర్నా చౌక్ అవసరమే లేదన్నారు. విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడమే పాలన అన్నట్లుగా వ్యవహరించారు. కూసీఆర్ వైఖరికి జనం సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఎన్నికలలో ఓడించి అధికారం నుంచి దింపేశారు. తెలంగాణ జాతి పితగా కితాబులందుకున్న ఆయన ఓటమి తరువాత సొంత పార్టీ నేతల నుంచే ధిక్కారాన్ని ఎదుర్కొన్నారంటే అందుకు ఆయన వ్యవహరించిన తీరే కారణం.
తెలంగాణ సాధన ఉద్యమమే ఊపిరిగా ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచారు. బలిదానాలను ఆపలేకపోయినా వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని ఆయనే చెప్పుకున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఆయనలోని మరో కోణం బయటపడింది. తీరు మారింది. వైఖరి మారింది.ప్రతిపక్షం లేకుండా చేయడానికి చాణిక్యనీతి వాడారు. బలిదానం చేసిన కుటుంబాలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. నీళ్లు, నియామకాలు అన్న తెలంగాణ ఆకాంక్ష సారాన్ని విస్మరించారు. ఉద్యమ సమయంలో తాను స్వయంగా తెలంగాణ ద్రోహులుగా విమర్శలు చేసిన వారికి తన కొలువులో పెద్ద పీట వేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్లలో ప్రజానేతగా కేసీఆర్ తన ప్రభను తానే మసక బార్చు కున్నారు. ప్రజా తిరస్కారానికి గురయ్యారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2019లో పగ్గాలు చేపట్టిన జగన్ అయితే స్వల్ప కాలంలోనే ప్రజలకు దూరమయ్యారు. వారిని చూడటం ఇష్టం లేకో, లేక ప్రశ్నించి నిలదీస్తారన్న వెరుపో కానీ పరదాలు కట్టుకుని మరీ తిరిగారు. ఎక్కడికక్కడ వందిమాగధులను పెట్టుకుని భజన చేయించుకున్నారు. బటన్ నొక్కి సొమ్ములు విదిలిస్తే ప్రజలు విశ్వాసంగా ఉంటారని తలచారు. అన్ని విధాలుగా ప్రజలను చులకన చేశారు. ఎవరైనా తన విధానాలను విమర్శిస్తే కేసులు, అరెస్టులు, అవీ కాకపోతే దాడులతో వేధించారు. ఇప్పుడు ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉంటుందన్న భయంతో వణికిపోతున్నారు.