రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? కేసీఆర్ బాటలోనే నరుక్కొస్తారా?
posted on Aug 26, 2021 @ 11:56AM
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య ఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా ఇప్పటికే బీజేపీ దూకుడు పెంచగా.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకంతో కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చింది. విపక్షాలు యాక్టివ్ కావడంతో గులాబీ బాస్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో తెలంగాణలో తీన్మార్ రాజకీయాలు సాగుతున్నాయి. పార్టీల నేతల మాటలు శృతి మించుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మల్లారెడ్డి నోటికి పని చెప్పారు. గబ్బుమాటలు మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉంటూ రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టారు. బట్టేబాజ్, లుచ్చా, సాలే, గూట్లే, లఫూట్, దొంగ, రాస్కేల్, బ్రోకర్, జోకర్, ఆడిబోకులోడ, మగాడివి కావా? దమ్ముందా? బ్లాక్ మెయిలర్, ఛీటర్ వంటి తిట్లతో రెచ్చిపోయాడు మల్లారెడ్డి. అంతేకాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొగోడే అయితే పిసిసి చీఫ్ పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తాను కూడా తన మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్లే హీరో అని ఒప్పుకుంటానని, ఒకవేళ తాను ఓడిపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి మల్లారెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్జిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ రచ్చగా మారాయి. కాంగ్రెస్ నేతలు మల్లారెడ్డికి తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. రేవంత్ అభిమానులు మల్లారెడ్డిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బూతులు మాట్లాడిన మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
మల్లారెడ్డి మాటలపై కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. మంత్రి హోదాలో చిల్లరగా వ్యవహరించారని చెబుతూనే.. ఇది తమకే కలిసి వస్తుందనే ఆలోచనలో ఉన్నారట హస్తం నేతలు. అంతేకాదు మల్లారెడ్డి సవాల్ ను అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ బలోపేతానికి కేసీఆర్ వాడిన స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి ఫాలో కావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి రాజీనామాలనే అస్త్రంగా చేసుకున్నారు కేసీఆర్. 2006లో, 2008లో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. కరీంనగర్ ఎంపీగా తాను కూడా రెండు సార్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి సక్సెస్ అయ్యారు. 2006లో వైఎస్సార్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ బయటికి వెళ్లాక కీలక పరిణామాలు జరిగాయి. టీఆర్ఎస్ ను చీల్చేందుకు వైఎస్సార్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో... కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ చేసిన ఓ కామెంట్ కేసీఆర్ కు అస్త్రంగా మారింది. కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఎమ్మెస్సార్.. రాజీనామా చేసి తనతో పోటీ పడాలని సవాల్ చేశారు.
ఇదే అదనుగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ ను ఓడించలేకపోయింది. కరీంనగర్ లోక్ సభ ఉప ఎన్నికలో కేసీఆర్ గెలుపు టీఆర్ఎస్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఉద్యమం మరింత ఉధృతమయ్యేందుకు దోహదపడింది. ఇప్పుడు కేసీఆర్ బాటలోనే మంత్రి మల్లారెడ్డి సవాల్ ను స్వీకరించి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలంగానే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక నేతలంతా యాక్టివ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ప్రచారం కూడా పెద్దగా చేయలేదు. అయినా రేవంత్ రెడ్డి గెలిచారు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ చాలా బలపడింది. అదే సమయంలో 2019 లో కంటే ప్రస్తుతం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తే బంపర్ మెజార్టీ వస్తుందని హస్తం నేతలు లెక్కలు వేస్తున్నారట.
మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ , మల్కాజ్ గిరి, కూత్పుల్లాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలపడటంతో పాటు రేవంత్ రెడ్డి మేనియా కనిపిస్తోంది. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని సెటిలర్ ఓటర్లంతా గంపగుత్తగా రేవంత్ రెడ్డికి జై కొట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక్కడ రేవంత్ కు ఏకపక్షంగా ఓట్లు వస్తాయని గాంధీభవన్ లెక్క. మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోనూ స్థానిక ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ కూడా తమకు మెజార్టీ ఖాయమని అంటున్నారు రేవంత్ అనుచరులు. ఈ లెక్కల మల్కాజ్ గిరి లో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళితే.. రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు.
మంత్రి మల్లారెడ్డి సవాల్ ను స్వీకరించి ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయంపై రేవంత్ రెడ్డి సీరియస్ గానే చర్చలు చేస్తున్నారని తెలుస్తోంది. మల్కాజ్ గిరిలో తిరిగి పోటీ చేస్తే తమకు తిరుగు ఉండదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపును ఇక ఎవరూ ఆపలేదనే భావనలో రేవంత్ రెడ్డి టీమ్ ఉందని తెలుస్తోంది. అయితే రాజీనామా నిర్ణయం సొంతగా తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి... హైకమాండ్ తో మాట్లాడాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కావడంతో పాటు భవిష్యత్ రాజకీయాలకు కేంద్రంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు.