20 మంది టీచర్లు, 50 మంది విద్యార్థులకు కరోనా! ఏపీలో హాట్ స్పాట్లుగా స్కూళ్లు...
posted on Aug 26, 2021 @ 12:04PM
భయపడినట్లే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. స్కూళ్లు వైరస్ హాట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా.. ఆగస్టు 16 నుంచి స్కూళ్లను నడుపుతోంది జగన్ సర్కార్. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతందనే విమర్శలు వచ్చాయి. అయినా మొండిగా వ్యవహించింది ప్రభుత్వం. ఇప్పుడు అందరు భయపడినట్లుగానే ఏపీలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో స్కూళ్లలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లోని స్కూళ్లల్లో కొందరు టీచర్లు. విద్యార్థులకు కరోనా వైరస్ అంటుకుంది. ప్రకాశం, కృష్ణా , నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో స్కూలులో మొత్తం కలిపి సుమారు 50 మంది విద్యార్థులకు వైరస్ సోకింది. 20 మంది టీచర్లకు కూడా వైరస్ నిర్దారణ అయింది. దీంతో ఆయా స్కూళ్ళను మూసేశారు. టీచర్లు విద్యార్ధులకు కరోనా వైరస్ సోకగానే మిగిలిన టీచర్లు విద్యార్ధులతో పాటు స్కూళ్ళల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం సిబ్బందికి కూడా టెస్టులు చేయిస్తున్నారు. వీళ్లతో పాటు కరోనా సోకిన టీచర్లు, విద్యార్థుల తల్లి దండ్రులు, కుటుంబసభ్యులకు కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించాల్సి రావటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్కో స్కూలులో 200 మంది విద్యార్ధులంటారని అనుకున్నా అందరు విద్యార్ధులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా టెస్టులు చేయించాల్సి రావటంతో స్ధానిక అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పదిమంది విద్యార్ధులకు కరోనా సోకడంతో స్కూలును వారం రోజుల పాటు మూసేశారు. తాజాగా ఏ స్కూల్లో అయినా 5 కేసులు బయటపడితే క్వారంటైన్ కోసమని 15 రోజులు స్కూల్ మూసేయాలని విద్యాశాఖ డిసైడ్ చేసింది. గతంలో కూడా కరోనా ఉధృతి తగ్గిందని అనుకోగానే ప్రభుత్వం స్కూళ్ళను తెరిచేసింది. దాంతో వెంటనే విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. దాంతో అప్పటికప్పుడు మళ్ళీ అన్నీ స్కూళ్ళను ప్రభుత్వం మూయించేసింది. ఇంత గ్యాప్ తర్వాత స్కూళ్ళను తెరవగానే మళ్ళీ కరోనా వైర్ బయటపడుతోంది. అక్టోబర్ కు థర్డ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంటుందనే నిపుణుల హెచ్చరికలతో విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.