వంగలపూడి అనితపై పవన్ ప్రశంసల వర్షం

సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలో నిలుచున్న సమయంలో గోడ కూలి ఏడుగురు మరణించిన విషాద ఘటన సందర్భంగా తక్షణం స్పందించి బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించిన హోంమంత్రి వంగలపూడి అనితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 29) అర్ధరాత్రి తరువాత కురిసిన బారీ వర్షానికి బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామున గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిందే.  ఈ విషాదఘటన విషయం తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్షణం ఆలస్యం కాకుండా స్పందించారు. సంఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే ఆమె ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ఒకే సమయంలో బాధితులకు అండగా నిలిచారు. ఇటు వారికి భరోసా కల్పిస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ ఇస్తూనే అటు పరిస్థితిని సమీక్షించి సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.  ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా.. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకున్నారు.  

సంఘటన జరిగిన వెంటనే వంగళపూడి అనిత పోలీసులు, ఎస్ఆర్డీఎఫ్ అధికారులను అప్రమత్తం చేసి సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాలా చూశారు.  అదే రోజు సాయంత్రం అంటే బుధవారం (ఏప్రిల్ 30)  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  సింహాచలం దుర్ఘటన సందర్శంగా హోంమంత్రి అనిత చేసిన సేవలను, బాధితులను ఓదార్చడంలో, వారిలో ధైర్యం నింపడంలో, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న నమ్మకం ప్రోది చేయడంలో ఆమె చూపిన చొరవకు, పడిన కష్టానికీ, విరామమెరుగకుండా అందించిన సేవలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో వంగళపూడి అనిత  నిబద్ధత, బాధితులకు అండగా నిలిచి, వారికి భరోసా కల్పించడంలో చూపిన చోరవ.. ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింప చేసేదిగా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి ఆమె ఇచ్చిన మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

కొన్ని నెలల కిందట ఇదే పవన్  కల్యాణ్ రాష్ట్రంలో  శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతిలో  వైకుంఠఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార ప్రవేశాల టికెట్ల కోసం తిరుపతిలో ఎదురు చూస్తున్న భక్తలు తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన సందర్భంలో కూడా ఆయన హోంమంత్రిత్వ శాఖ పని తీరును తప్పపట్టడమే కాకుండా అవసరమైతే హోంమంత్రిత్వ శాఖను తానే తీసుకుంటానని కూడా హెచ్చరించారు. అదే పవన్ కల్యాణ్ ఇప్పుడు ోంమంత్రి వంగలపూడి అనితపై ప్రశంసలు గుప్పించడం ద్వారా కూటమి పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చాలూ లేవనీ,  కూటమి ఐక్యంగానే ఉందనీ చాటడమే కాకుండా తన ప్రశంసల ద్వారా వంగళపూడి అనితలో కొత్త ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ నింపారు. పవన్ ప్రశంసలపై స్పందించిన అనిత కూడా ఇదే విషయాన్ని తెలిపారు. హోంమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు తనకు మరింత చురుకుగా, చొరవగా పని చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. 

Teluguone gnews banner