బీజేపీ కథ కంచికే.. పవన్‌కు దిక్కు చంద్రబాబే..
posted on May 2, 2021 @ 3:38PM
తిరుపతి. టెంపుల్ సిటీ. కాషాయం యాక్టివిటీ కాస్త ఎక్కువ. అందుకే, మిత్రపక్షం జనసేనతో పోరాడి మరీ తిరుపతి ఎంపీ స్థానంలో బరిలో నిలిచింది బీజేపీ. పవన్ కల్యాణ్ సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కమలానికి సపోర్ట్‌గా ప్రచారం కూడా చేశారు జనసేనాని. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోదర్.. పలువురు కేంద్రమంత్రులు, తెలంగాణ బీజేపీ నేతలు.. ఇలా కాషాయ దళం పెద్ద ఎత్తున తిరుపతిలో దిగిపోయింది. బీజేపీ అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ గెలుపు కోసం బీజేపీ-జనసేనలు పట్టుదలతో ప్రయత్నం చేశారు. ఇంతా చేస్తే.. బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్నంటే.. 50వేలకు కాస్త అటూఇటూ. ఇంత మాత్రానికే బీజేపీ అంత బిల్డప్ ఇచ్చిందా అంటూ చర్చ జరుగుతోంది. ఏపీలో బీజేపీ కథ ముగిసినట్టేనని జోస్యం మొదలైపోయింది. బీజేపీతో కలిసుంటే జనసేనకూ రాజకీయ అంధఃకారమేనంటూ విశ్లేషణ నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేనల మైత్రీ.. మునిగే టైటానిక్ షిప్‌లాంటిదంటున్నారు.
చంద్రబాబుతో స్నేహం.. టీడీపీతో పొత్తు ఉన్నంత కాలమే ఏపీలో బీజేపీకైనా, జనసేనకైనా మనుగడ సాధ్యమైంది. ఎప్పుడైతే ప్రధాని మోదీ ఏపీకి అన్యాయం చేయడం మొదలైందో.. వెంటనే బీజేపీతో ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకున్నారు చంద్రబాబు. ఆనాటి నుంచి బీజేపీని ఆంధ్రప్రదేశ్ పాలిట ద్రోహిగా, దోషిగా చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. అందుకే, టీడీపీతో జట్టు కట్టి.. 2014 ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి.. బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆనాటి నుంచి ఏపీలో కమల వికాసం క్రమంగా కనుమరుగు అయింది. అది తిరుపతి ఎన్నికల్లోనూ సుస్పష్టంగా కనిపించింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ, వైసీపీ మధ్య కొనసాగుతున్న చీకటి స్నేహం.. కమలదళానికి పెద్ద మైనస్. అందుకే, తిరుపతిలో ఇంతటి ఘోర పరాభవం.
అప్పట్లో పవన్ కల్యాణ్ సైతం బీజేపీని, కేంద్రాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని.. అదే బీజేపీతో ఇప్పుడు అంటకాగుతున్నాడు. 2019లో తిరుపతి ఎన్నికల్లో పవన్‌ను ఓడించిన ప్రజలే.. ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీ ఎన్నికల్లో పీకే మద్దతిచ్చిన రత్నప్రభను ఓడించారు. ఏపీలో పవర్ స్టార్‌కు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ.. అది పవర్‌లోకి వచ్చేందుకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మునిగే నావలాంటి బీజేపీని నమ్ముకోవడమే పవన్ చేస్తున్న మిస్టేక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే పవన్.. చంద్రబాబుతో కలిసుంటే.. ఫలితాలు మరోలా వచ్చేయని అంటున్నారు. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతిచ్చిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతాన్ని కలిపి.. విశ్లేషిస్తే.. ఈ రెండు పార్టీల పొత్తు.. అధికార వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమంటున్నారు. కానీ, లెక్కలేనంత తిక్క ఉన్న పవన్ కల్యాణ్‌కి ఇలాంటి పొలిటికల్ లెక్కలు తలకెక్కితేగా?
2019 నుంచి ఇప్పటి తిరుపతి బైపోల్ వరకూ.. బీజేపీ ఎక్కడా, ఏమాత్రం ఉనికి చాటడం లేదు. ఏపీలో ఆ పార్టీకి కొందరు లీడర్లైతే ఉన్నారు కానీ... కార్యకర్తలు, ఓటర్లు మాత్రం దాదాపు లేనట్టే. తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో కాస్తోకూస్తో కమలనాథుల హడావుడి కనిపించేది ఒక్క తిరుపతిలోనే. ఇప్పుడు అక్కడా ఓట్లు పడక.. డిపాజిట్ కోసం కష్టపడిన బీజేపీకి.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భవిష్యత్తు కష్టసాధ్యమే. ఆ విషయంలో తిరుపతి ఉప ఎన్నికతో స్పష్టత వచ్చేసింది. క్లారిటీ రావాల్సింది ఒక్క జనసేనానికే. ఇప్పటికైనా మించి పోయింది లేదు.. గతంలో కామ్రేడ్లతో దోస్తీ చేసి.. ఆ తర్వాత వారికేమైనా బాకీ పడ్డానా అంటూ.. కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చినట్టుగానే.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం ఎంతైనా బెటర్. లేదంటే.. తాను నిండా మునగడమే కాకుండా.. జనసేననూ ప్రజాక్షేత్రంలో ముంచేయగలదు కమలం పార్టీ. ఆంధ్రులకు అండగా ఎప్పటికీ నిలిచే పార్టీ ఏదైనా ఉందంటే.. అది ఒక్క తెలుగుదేశం పార్టీనే. అధికార పార్టీ అగడాలు, అరాచకాలను ఎదురించగల సత్తా.. అడ్డుకోగల సత్తువా.. ఒక్క టీడీపీకే సొంతం. అందుకే, ఎన్నటికైనా వైసీపీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశమే. బీజేపీ, జనసేన కానేకావు. ఆ పార్టీలకు ఏపీలో అంత సీన్ లేదు. ఆ విషయం తిరుపతి ఎన్నికతో మరోసారి స్పష్టమైంది. భవిష్యత్ టీడీపీదేనని తేలిపోయింది. బీజేపీ భ్రమలో ఉన్న పవన్ కల్యాణ్‌కి ఇప్పటికైనా రాజకీయంగా జ్ఞానోదయం అయితే అది రాష్ట్రానికే మంచిది. బీజేపీ, వైసీపీ కలిసి ఆడుతున్న పొలిటికల్ డ్రామాలో.. పీకే.. పావుగా మారాడనేది విశ్లేషకుల మాట.