డిపాజిట్ గల్లంతు.. తెలుగు రాష్టాల్లో బీజేపీకి షాక్
posted on May 2, 2021 @ 3:24PM
దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. నరేంద్ర మోడీ, అమిత్ షా సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రెండు స్థానాల్లోను డిపాజిట్లు కోల్పోయారు బీజేపీ అభ్యర్థులు.
గత నవంబర్ లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ.. తెలంగాణలో స్పీడ్ పెంచింది. తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమనే సంకేతం ఇచ్చింది. అయితే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ సీన్ మారిపోయింది. ఎంతగా పోరాడినా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది కమలదళం. నాగార్జున సాగర్ లో డిపాజిట్ కోల్పోయి పరువు పోగొట్టుకుంది బండి సంజయ్ టీమ్. సాగర్ లో మొత్తం లక్షా 89 వేల ఓట్లు పోల్ కాగా... బీజేపీ అభ్యర్థి రవి నాయక్ కు కేవలం 6 వేల 810 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీ కేవలం 4 శాతం ఓట్లు మాత్రం సాగర్ లో సాధించింది. గిరిజన అభ్యర్థిని బరిలోకి దింపి ప్రయోగం చేసినా.. ఆ సామాజిక వర్గం ఓట్లను కూడా దక్కించుకోలేకపోయింది. దుబ్బాక ఉపఎన్నిక మీద బీజేపీ కనబరిచిన దూకుడు సాగర్ లో పెద్దగా కనిపించలేదు. నాగార్జున సాగర్ లో బీజేపీ మొదటి నుంచి గందరగోళంగానే వ్యవహరించింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆలస్యంగా నిర్ణయం తీసుకుంది. ఎలాగు ఓటమి తప్పదని కమలనాధులు ముందే ఊహించి అంతగా శ్రద్ధ పెట్టలేదని గుసగుసలు వినిపించాయి.
ఏపీలోని తిరుపతి ఉపఎన్నికను మాత్రం ఏపీ బీజేపీ, జనసేన పార్టీలు సీరియస్‌గా తీసుకున్నా ఫలితం కనిపించ లేదు. అధ్యాత్మిక కేంద్రంలో తమకు కలిసి వస్తుందని భావించింది. తిరుపతిలో జనసేనతో కలిసి పోటీ చేసింది బీజేపీ. తమ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను బరిలోకి దింపింది. ప్రచారంలోనూ శ్రమించారు కమలం నేతలు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా రోడ్ షో నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది బీజేపీ.కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏమాత్రం పోటీని ఇవ్వకపోగా, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడం బీజేపీకి పెద్ద దెబ్బగా పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతిలో గెలవకపోయినా.. రెండో స్థానంలో నిలవాలని బీజేపీ భావించింది. అయితే కౌంటింగ్ లో మాత్రం అ పార్టీకి ఘోరంగా దెబ్బతిన్నది. ప్రధాన ప్రతిపక్షం అనుకున్న దానికంటే మంచిగానే ఓట్లు సాధించగా.. బీజేపీ మాత్రం ఘోరంగా చతికిలపడింది