మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్న జనసేనాని
posted on May 13, 2024 @ 10:32AM
మంగళగిరిలో ఓటు హక్కును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పవన్ ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ ఈ పోలింగ్ సెంటర్కు వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఒకానొక సందర్భంలో పోలింగ్ బూతులోకి దూసుకొని వచ్చారు కొందరు వీరాభిమానులు. అయితే పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు.