పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘వారాహి దీక్ష’ అంటే ఏమిటి?
posted on Jun 25, 2024 @ 1:04PM
పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్షకు తంత్ర సాధనలో చాలా ప్రాధాన్యం వుంది. తన ఎన్నికల ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన ఇష్టదేవత వారాహి అమ్మవారి దీక్షని కూడా 11 రోజులపాటు చేపట్టారు. అసలీ వారాహి దీక్ష అంటే ఏమిటి?
వారాహి అంటే పంది శిరస్సుతో వుండే అమ్మవారు. వారాహి అంటే లలితాదేవి అమ్మవారి సాయుధ దళాలకు చీఫ్ కమాండర్ అని చెప్పుకోవచ్చు. లలితాదేవి అమ్మవారి ఆజ్ఞాచక్రం దగ్గర నివసిస్తూ, ఆమె ఆదేశాలు (ఆజ్ఞలు) పాటిస్తూ, తన దగ్గర వున్న విస్తారమైన సైన్యంతో ఎంతటి బలవంతుడైన శత్రువునైనా ఓడించగలదు. వారాహి శక్తులను సానుకూల ధోరణిలో ఉపయోగించడం వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను అధిగమించవచ్చు. అంతర్గంగా వున్న వ్యాధులకు చికిత్స చేసుకోవచ్చు. జీవితంలో నాణ్యతను పెంచుకోవచ్చు. ఒకరి తరఫున వేరే ఎవరైనా వారాహి మంత్ర సాధన చేసి, ఆ తర్వాత జల ప్రోక్షణ చేయడం వల్ల ఎవరి కోసమైతే మంత్ర సాధన చేశారో ఆ వ్యక్తికి మేలు జరుగుతుంది. ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో వారాహి మాత సాధన ఉపయోగపడుతుంది.
వరాహ రూపంలో వున్న మూర్తిని ఒక శక్తిగా ఆరాధించడం అనేది కేవలం హిందూ పురాణాలలో మాత్రమే కాదు.. సెల్టిక్, జపనీస్, చైనీస్, గ్రీక్, అమెరికన్, ఈజిప్టియన్ సంస్కృతులలో భాగంగా కూడా వుంది. వారాహి దేవత ధైర్యం, నిర్భయం, స్వయం నియంత్రణ శక్తులకు ప్రతిరూపం. శత్రువుతో పోరాడటానికి అవసరమైన ధైర్యాన్ని వారాహి ఇస్తుంది. ఒక్కోసారి విజయం మనల్ని అహంకారంలోకి నెట్టేస్తుంది. వారాహి దీక్ష చేయడం, వారాహిని ఆరాధించడం వల్ల మనసులో చేరిన అహంకారం తొలగిపోతుంది. వారాహి దీక్షను రెండు స్థాయిల్లో చేపడతారు. ఒకటో స్థాయిలో రక్షణ కోసం చేసే వారాహి అస్త్ర బీజ మంత్ర సాధన వుంటుంది. రెండో స్థాయిలో మంచి ఆరోగ్యం కోసం వారాహి అస్త్ర బీజమంత్ర సాధన వుంటుంది.
వారాహి దీక్ష, వారాహి మంత్ర సాధన చేయడం వల్ల చేకూరే ఇతర ప్రయోజనాలు... నరదిష్టి తొలగుతుంది. రాహు - కేతు దోషాలు పోతాయి. ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమ మీద జరిగిన తంత్ర, మంత్ర ప్రయోగాలను అరికడుతుంది. ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. శక్తి, కీర్తి, పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది. సంపదను అందిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి లభిస్తుంది. శత్రువులు, పురోగతికి అడ్డుగా నిలిచేవారి నుంచి రక్షణ లభిస్తుంది. ఏంటీ ఆలోచిస్తున్నారు.. మీకూ వారాహి దీక్ష చేయాలని అనిపిస్తోందా? శుభం!